Balloon: చైనా నిఘా బెలూన్ భారత గగనతలం పైనా సంచరించిందా...?
- ఇటీవల అమెరికా గగనతలంపై చైనా బెలూన్లు
- క్షిపణులు ప్రయోగించి కూల్చివేసిన అమెరికా
- నిఘా బెలూన్లు అంటూ ఆరోపణలు
- గతేడాది అండమాన్ నికోబార్ దీవులపై బెలూన్!
- కొద్దిసేపట్లోనే సముద్రతలంపైకి వెళ్లిపోయిన వైనం
ఇటీవల అగ్రరాజ్యం అమెరికా తన గగనతలంలో కనిపించిన చైనా బెలూన్లను కూల్చివేయడం తెలిసిందే. అవి చైనా పంపిన నిఘా బెలూన్లే అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి బెలూన్లే కనిపించినట్టు వార్తలు వచ్చాయి. కాగా, గతేడాది భారత గగనతలంలోనూ ఓ బెలూన్ సంచరించినట్టు వెల్లడైంది.
అండమాన్ నికోబార్ దీవుల పైన ఈ బెలూన్ ను గుర్తించినట్టు తెలుస్తోంది. భారత సైన్యం దీన్ని గుర్తించినప్పటికీ, కూల్చివేద్దామా వద్దా అని నిర్ణయం తీసుకునే లోపే నైరుతి దిశగా భూభాగాన్ని దాటి సముద్రతలం పైకి వెళ్లిపోయిందని ఓ కథనంలో వెల్లడించారు. ఉన్నట్టుండి ప్రత్యక్షమైన ఆ బెలూన్ రాడార్లను కూడా తప్పించుకుందని వివరించారు.
అయితే అప్పట్లో దాన్ని వాతావరణ పరిశోధనల బెలూన్ అనే భావించారని, కానీ ఇటీవల చైనా నిఘా బెలూన్లను అమెరికా కూల్చివేసిన ఘటనల నేపథ్యంలో, నాడు కనిపించిన బెలూన్ నిఘా వేసేందుకు ఉద్దేశించినదే అయ్యుండొచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. దాంతో, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పై బెలూన్ ఎగిరిన వ్యవహారాన్ని అధికారులు మరోసారి సమీక్షించనున్నట్టు ఆ కథనంలో తెలిపారు.