Congress rolls out rose carpet: ప్రియాంకా గాంధీని ఆహ్వానించేందుకు దారి పొడవునా ఎర్ర గులాబీలు.. వీడియో ఇదిగో!
- కాంగ్రెస్ ప్లీనరీ జరుగుతున్న రాయ్ పూర్ లో ‘ఎర్ర’ తివాచీ
- 6 వేల కిలోల గులాబీలను ఉపయోగించిన కాంగ్రెస్ నేతలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో జరుగుతున్నాయి. పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కీలక నేత రాహుల్ గాంధీతోపాటు.. 15 వేల మందికి పైగా ప్రతినిధులు, నాయకులు అక్కడికి చేరుకున్నారు.
శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ కూడా వచ్చారు. ఎయిర్ పోర్టులో ఆమెకు చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ స్వాగతం పలికారు. అయితే ప్రియాంకను ఆహ్వానించేందుకు చేసిన ఏర్పాట్లు చర్చనీయాంశమయ్యాయి.
రాయ్ పూర్ లోని ప్రధాన రోడ్డుపై గులాబీ పూలను పరిచారు. రోడ్డుకు ఒకవైపున కనుచూపు మేర పూలతో అలంకరించారు. ఇందుకు సంబంధించిన వీడియోను వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. పూలతో రోడ్డును నింపేయగా.. ఎడమ వైపున భారీగా జనం జెండాలు పట్టుకుని నిలబడటం అందులో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై పరిచేందుకు 6 వేల కిలోలకు పైగా గులాబీలను ఉపయోగించినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు సాగే సమావేశాలు రేపు పూర్తి కానున్నాయి. రాజకీయ, ఆర్థిక అంశాలపై ప్లీనరీలో తీర్మానాలు చేయనున్నారు. రేపు ప్లీనరీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు.