CPT: ఇకపై గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి

Computer proficiency certificate mandatory for group 2 and group 3 recruitment in AP
  • గ్రూప్-2, గ్రూప్-3 నియామకాల నిబంధనల్లో మార్పులు
  • సీపీటీ పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలన్న సాధారణ పరిపాలన శాఖ
  • సర్టిఫికెట్ లేకపోతే నియామకానికి అవకాశం లేదని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగ నియామకాల నిబంధనల్లో మార్పులు చేశారు. గ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాలకు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ సర్వీసుల కార్యదర్శి పోలా భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఏపీపీఎస్సీ లేదా ఏపీ సాంకేతిక విద్యాబోర్డు నిర్వహించే కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్టు (సీపీటీ) పాస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేశారు. సీపీటీ పాస్ సర్టిఫికెట్ లేకుండా నియామకానికి అవకాశం లేదంటూ అడ్ హాక్ నిబంధనల్లో పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా నియమితులయ్యే వారంతా సీపీటీ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. 

వంద మార్కులకు సీపీటీ నిర్వహించడం జరుగుతుందని సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు కనీసం 30 మార్కులు సాధించాల్సి ఉంటుందని వివరించింది. బీసీలు 35, ఓసీలు 40 మార్కులు సాధించాలని తెలిపింది. 

కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు, వివిధ రకాల ఆపరేటింగ్ సిస్టమ్ లు, ఇంటర్నెట్ అంశాల్లో పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించింది. గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాలకు ఈ తాత్కాలిక నిబంధన వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
CPT
Group-2
Group-3
APPSC
Andhra Pradesh

More Telugu News