T20 World Cup: నేడే మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్.. ఎవరి బలం ఎంత?
- ఆతిథ్య దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ
- ఆరో ట్రోఫీపై గురిపెట్టిన ఆస్ట్రేలియా
- తొలిసారి ఫైనల్ కు వచ్చిన సఫారీలు
- సా. 6.30 నుంచి స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం
దక్షిణాఫ్రికా గడ్డపై హోరాహోరీగా సాగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్ లో విజేత ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. అత్యంత బలమైన ఆస్ట్రేలియా.. అనూహ్యంగా ముందుకొచ్చిన ఆతిథ్య దక్షిణాఫ్రికా ఈ సాయంత్రం జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీస్‌లో మాజీ చాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిచ్చిన సౌతాఫ్రికా తొలిసారి ఫైనల్ చేరుకోగా.. ఈ ఫార్మాట్లో తిరుగులేని ఆసీస్ ఏకంగా ఏడోసారి ఫైనల్ ఆడనుంది.
సొంతగడ్డపై అనుకూలతలను ఉపయోగించుకొని తొలిసారి కప్పు నెగ్గాలని దక్షిణాఫ్రికా అమ్మాయిలు ఆశిస్తుండగా.. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ఆసీస్ ఆరో ట్రోఫీతో ‘సిక్సర్’ కొట్టాలని కోరుకుంటోంది. ఫైనల్లో దక్షిణాఫ్రికా గెలిస్తే ఈ టోర్నీలో కొత్త విజేత ఆవిర్భవించనుంది. సౌతాఫ్రికా జట్టులో ఓపెనర్లు లారా వోల్వార్ట్, టమ్జిన్ బ్రిట్స్, ఆల్‌రౌండర్ మరిజానె కాప్ , పేసర్లు షబ్నమ్ ఇస్మాయిల్, అయబోంక ఖకా అత్యంత కీలకంగా ఉన్నారు. సొంత గడ్డపై, స్వదేశ అభిమానుల సమక్షంలో ఆట వారికి అనుకూలం కానుంది.
ఇక ఇప్పటిదాకా జరిగిన ఏడు ఎడిషన్లలో ఐదుసార్లు కప్పు నెగ్గిన ఆసీస్ అత్యంత బలమైన జట్టుగా ఉంది. ఒత్తిడిలో పుంజుకోవడం ఆ జట్టుకు వెన్నతో పెట్టిన విద్య. సెమీస్ ఫైనల్లో భారత జట్టును ఓడించిన తీరునే ఇందుకు ఉదాహరణ. పైగా ఈ టోర్నీలో ఒక్క ఓటమి లేకుండా ఫైనల్ కు దూసుకొచ్చింది. ఆ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. బ్యాటింగ్‌లో అలీసా హీలీ, బెత్ మూనీ, కెప్టెన్ మెగ్‌లానింగ్, బౌలింగ్‌లో గార్డ్నర్, మేగన్ షుట్, డార్సి బ్రౌన్ సత్తా చాటుతున్నారు. ఫీల్డింగ్ లోనూ అందరూ ఓ మెట్టు పైనే ఉన్నారు. మరి, సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లలో కప్పు కొట్టేది ఎవరో చూడాలి.