Ravi Shastri: టీమిండియాకు వైస్ కెప్టెన్ అవసరమా?: రవిశాస్త్రి
- ఇటీవల వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్
- టీమిండియాకు వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్
- రాహుల్ పై తీవ్ర విమర్శలు
- స్వదేశంలో టీమిండియాకు వైస్ కెప్టెన్ అక్కర్లేదన్న రవిశాస్త్రి
క్రికెట్ క్రీడలో బాగా రాణించే ఆటగాళ్లను కెప్టెన్, వైస్ కెప్టెన్ గా నియమించడం తెలిసిందే. అయితే టీమిండియా వైఎస్ కెప్టెన్ గా నియమితుడైన ఓపెనర్ కేఎల్ రాహుల్ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుల్లో రాహుల్ ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్ లో ఆడేటప్పుడు టీమిండియాకు వైస్ కెప్టెన్ అవసరమా అని ప్రశ్నించాడు. వైస్ కెప్టెన్ బాగా ఆడకపోతే తుది జట్టు ఎంపిక ఓ సవాలుగా మారుతుందని, వైస్ కెప్టెన్ గా ఉన్న ఆటగాడిని జట్టు నుంచి తొలగించలేని క్లిష్ట పరిస్థితి ఎదురవుతుందని అన్నాడు. అయితే ఇది స్వదేశం వరకేనని, విదేశాల్లో పర్యటించేటప్పుడు పరిస్థితి ఎంతో భిన్నంగా ఉంటుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. తనవరకైతే టీమిండియాకు వైస్ కెప్టెన్ అవసరంలేదని స్పష్టం చేశాడు.
ఫామ్ లో లేని ఆటగాళ్లు కొంత విరామం తీసుకుంటే బాగుంటుందని, నూతన ఉత్సాహంతో వారు మళ్లీ బరిలో దిగొచ్చని సూచించాడు.