Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ డిప్యూటీ సీఎం సిసోడియా అరెస్ట్
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు కీలక పరిణామం
- విచారణకు వచ్చిన సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ
- రేపు కోర్టులో హాజరు
- తామందరం సిసోడియా వెంటే ఉన్నామన్న కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సీబీఐ ఈ సాయంత్రం అరెస్ట్ చేసింది. ఇవాళ ఆయనను విచారణకు పిలిపించిన సీబీఐ అధికారులు... అనంతరం అరెస్ట్ చేస్తున్నట్టు తెలిపారు.
సిసోడియాను ఇవాళ 8 గంటల పాటు ప్రశ్నించారు. సిసోడియా విచారణ, అరెస్ట్ నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా, మనీశ్ సిసోడియాకు రేపు మధ్యాహ్నం అన్నిరకాల వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చనున్నారు.
ఢిల్లీ ప్రభుత్వ నూతన మద్యం విధానం ఖరారు చేయడం వెనుక అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం జరగడానికి మార్గం సుగమం చేశారని సిసోడియాపై ఆరోపణలు ఉన్నాయి.
సిసోడియాను అరెస్ట్ చేస్తారని ఆప్ వర్గాలు ముందే ఊహించాయి. సిసోడియా సైతం ఇదే భావనతో నేడు విచారణకు తరలివెళ్లారు. కొన్ని నెలల పాటు జైల్లో ఉండేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని ఆయన ఇంతకుముందే పేర్కొన్నారు.
దీనిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ... "దేవుడు నీకు అండగా ఉంటాడు మనీశ్. రాష్ట్రంలోని లక్షలాది పిల్లలు, వారి తల్లిదండ్రుల దీవెనలు నీకు లభిస్తాయి. ఒకవేళ నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తే అది నీ దేశం కోసం, నీ సమాజం కోసమే జైలుకు వెళుతున్నట్టు అవుతుంది. జైలుకు వెళ్లడం శాపమేమీ కాదు. నీ వంటి మంచి వ్యక్తులకు అది శోభనిస్తుంది. త్వరలోనే జైలు నుంచి తిరిగి రావాలని దేవుడ్ని ప్రార్థిస్తాను. మేమందరం నీకోసం ఎదురుచూస్తుంటాము" అని ట్వీట్ చేశారు.