Twitter: మరోసారి ఉద్యోగులను తొలగించిన ట్విట్టర్.. బ్లూటిక్ ఇన్ఛార్జ్ పై కూడా వేటు
- ట్విట్టర్ లో కొనసాగుతున్న లేఆఫ్స్
- తాజాగా ఇంజినీరింగ్, ప్రాడక్ట్ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు
- కొన్ని డజన్ల మందిని తొలగించినట్టు సమాచారం
ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకోవడం ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు పెను శాపంగా పరిణమించింది. కంపెనీ పగ్గాలను అందుకున్న వెంటనే పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేయడాన్ని మస్క్ ప్రారంభించాడు. టాప్ లెవెల్ నుంచి కింది స్థాయి వరకు నిర్దాక్షిణ్యంగా వేటు వేస్తున్నాడు. తాజాగా మరోసారి ట్విట్టర్ లో లేఆఫ్స్ కొనసాగాయి. ఈసారి ఇంజినీరింగ్, ప్రాడక్ట్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించారు.
ఉద్యోగం నుంచి తమను తొలగించినట్టు ఈమెయిల్స్ వచ్చాయని కొందరు తెలిపారు. ఇంటర్నల్ సిస్టమ్ లోకి లాగిన్ కాలేకపోయామని... దీంతో తమను తొలగించారనే విషయాన్ని అర్థం చేసుకున్నామని మరికొందరు ఉద్యోగులు తెలిపారు. తాజా లేఆఫ్స్ లో కొన్ని డజన్ల మందిని తొలగించినట్టు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ పై స్పందించాలన్న బ్లూంబర్గ్ కామెంట్ కు ట్విట్టర్ స్పందించలేదు.
తాజా లేఆఫ్ లో కంపెనీ ఎగ్జిక్యూటివ్ హోదాలో పని చేస్తున్న ఎస్తర్ క్రాఫోర్డ్ కూడా ఉన్నారు. సబ్ స్క్రిప్షన్ సర్వీస్ బ్లూటిక్ ఇన్ఛార్జ్ గా ఆయన వ్యవహరిస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ యాజమాన్యం తీసుకుంటున్న చర్యలతో ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారు.