Sisodia: సిసోడియా అరెస్టుకు కారణాలివే.. సీబీఐ
- విచారణకు ఢిల్లీ డిప్యూటీ సీఎం సహకరించలేదని ఆరోపణ
- పలు కీలక ప్రశ్నలకు సమాధానం దాటవేశారని వెల్లడి
- కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిందేనని తేల్చిన అధికారులు
- ఈ రోజు మధ్యాహ్నం సిసోడియాను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన కారణాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు మీడియాకు వెల్లడించారు. ఆదివారం సుమారు 8 గంటల పాటు సిసోడియాను అధికారులు ప్రశ్నించారు. అయితే, ఆయన సమాధానాలు సంతృప్తికరంగా లేవని, పలు ప్రశ్నలకు సంబంధంలేని జవాబులిచ్చారని చెప్పారు. లిక్కర్ పాలసీ స్కామ్ విచారణలో తమకు సిసోడియా సహకరించలేదని తెలిపారు.
పలు కీలక సందేహాలకు ఆయన వివరణ సరిగాలేదని అన్నారు. సాక్ష్యాధారాలతో ప్రశ్నించినా దాటవేత దోరణి ప్రదర్శించారని ఆరోపించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించినా సిసోడియా సంతృప్తికరమైన జవాబులివ్వడంలో విఫలమయ్యారని చెప్పారు. ఈ నేపథ్యంలో సిసోడియాను కస్టడీలోకి తీసుకుని మరింత విచారించాల్సిన అవసరం ఉందని భావించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.
దీంతో ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో సిసోడియాను అరెస్టు చేసినట్లు వివరించారు. కాగా, సిసోడియాను సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సీబీఐ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతకుముందు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.