Pizza: బ్రిటన్ లో మంట పుట్టిస్తున్న పిజ్జా.. పాస్తా!
- టమాటాలు లేకుండా తయారీ
- పెరిగిపోయిన టమాటాల ధరలు
- ఏడాది కాలంలో నాలుగింతలు పెరిగి కిలోకి రూ.2,000
- తగ్గిపోయిన సరఫరా
రుచి తప్పడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అయితే అసలు విషయం తెలుసుకోవాల్సిందే. బ్రిటన్ లోని పలు రెస్టారెంట్లు ఇప్పుడు పిజ్జా, పాస్తాలను టమాటాలు లేకుండా తయారు చేసి వడ్డిస్తున్నాయి. దీనికి కారణం అక్కడ టమాటాలకు కొరత ఏర్పడడమే. ఫలితంగా టమాటాల ధరలు చుక్కలనంటాయి. ఎంత అంటే.. గడిచిన ఏడాది కాలంలోనే అక్కడ టమాటాల ధరలు కిలోకి నాలుగు రెట్లు పెరిగాయి. 5 పౌండ్లు ఉండే ధర కాస్తా.. 20 పౌండ్లకు చేరింది. అంటే మన కరెన్సీలో అయితే సుమారుగా 2,000 రూపాయిలు.
ఇక క్యాన్డ్ టమాటా ధర 15 పౌండ్ల నుంచి 30 పౌండ్లకు చేరింది. ఈ దెబ్బకు కొన్ని రెస్టారెంట్లు టమాటాలు లేకుండా పిజ్జా, పాస్తాలను కస్టమర్లకు సరఫరా చేస్తున్నాయి. కొన్ని అయితే టమాటాలు కొనలేని పరిస్థితితో తమ మెనూ నుంచి పిజ్జా, పాస్తా తదితర వాటిని తొలగించేశాయి. ‘‘వైట్ పిజ్జా, పాస్తా కోసం వైట్ సాస్ లేదా టమాటాలు లేకుండా ఇస్తున్నాం. టమాటాల కొరత, ధరలు పెరగడంతో ఈ కొత్త ట్రెండ్ ను అనుసరిస్తున్నాం’’అని ఇటాలియన్ చెఫ్ ల అసోసియేషన్ ఎఫ్ఐసీ ప్రెసిడెంట్ ఎంజో ఒలివెరి ప్రకటించారు.
బ్రిటన్ శీతాకాలంలో 95 శాతం టమాటాలను దిగుమతి చేసుకుంటుంది. స్పెయిన్, ఉత్తరాఫ్రికా దేశాలు బ్రిటన్ కు టమాటాలను సరఫరా చేస్తుంటాయి. స్పెయిన్ లో అసాధారణ ఉష్ణోగ్రతల వల్ల ఉత్పత్తి పడిపోయింది. షిప్పింగ్ జాప్యం వల్ల కూడా సరఫరాలో సమస్యలు ఏర్పడ్డాయి. అధిక ఎలక్ట్రిసిటీ చార్జీలు గ్రీన్ హౌస్ లలో పండించే టమాటా ధరలపై పడినట్టు సమాచారం.