combodia: బర్డ్ ఫ్లూతో కంబోడియాలో పదకొండేళ్ల బాలిక మృతి.. డబ్ల్యూహెచ్ వో అలర్ట్

11 years old girl dead with Bird Flu in combodia

  • బాలిక తండ్రికి సోకిందని వైద్య పరీక్షలలో వెల్లడి
  • మనుషులకు సోకడం అరుదంటున్న నిపుణులు
  • జాగ్రత్తగా ఉండాలంటూ ప్రపంచ దేశాలకు డబ్ల్యూహెచ్ వో హెచ్చరిక

బర్డ్ ఫ్లూ కారణంగా కంబోడియాలో పదకొండేళ్ల బాలిక ప్రాణాలు కోల్పోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అప్రమత్తమైంది. వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ అన్ని దేశాలకు సూచించింది. బర్డ్ ఫ్లూలో హెచ్ 5 ఎన్ 1 వైరస్ మనుషులకు సోకుతోందని, ప్రాణాంతకంగా మారుతోందని హెచ్చరించింది. ఈ నెల 16 న కంబోడియాలో ఓ బాలిక జ్వరం, గొంతునొప్పి, దగ్గు లక్షణాలతో ఆసుపత్రిలో చేరిందని, వైద్య పరీక్షల్లో బాలికకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు తేలిందని పేర్కొంది.

చికిత్స పొందుతూ సదరు బాలిక ఈ నెల 22న ప్రాణాలు కోల్పోయిందని వివరించింది. బాలిక తండ్రితో పాటు మరో 12 మందికి పరీక్షలు నిర్వహించగా.. బాలిక తండ్రికి కూడా వైరస్ సోకిందని తేలింది. అయితే, అతడిలో లక్షణాలు కనిపించడంలేదని వైద్యులు వెల్లడించారని వివరించింది. మిగతా వారికి నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇంకా వెల్లడికాలేదని తెలిపింది.

కోళ్లు, ఇతర పక్షులలో కనిపించే బర్డ్ ఫ్లూ వైరస్.. మనుషులకు సోకడం అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూలో ఒక రకం వైరస్ ను మనుషుల్లో గుర్తించినట్లు గతంలో పరిశోధకులు తెలిపారు. ఈ రకం వైరస్ సోకిన పక్షులతో డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల మనుషులకు వ్యాపిస్తుందని వివరించారు. కంబోడియా బాలిక విషయంలో వైరస్ ఎలా సోకిందనే దానిపై ఆరా తీస్తున్నట్లు డబ్ల్యూహెచ్ వో వెల్లడించింది. దీనిపై బాలిక తండ్రిని విచారించాలని కంబోడియా అధికారులకు సూచించినట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News