padayatra with shackles: సంకెళ్లతో పాదయాత్ర.. ఎందుకు, ఎక్కడంటే..?
- మహారాష్ట్రలోని రాజురా నియోజకవర్గం నుంచి హైదరాబాద్ కు దంపతుల పాదయత్ర
- ఒంటిపై సంకెళ్లు వేసుకుని.. ‘కేసీఆర్ రావాలి.. సంకెళ్లు తెంచాలి’ అన్న బ్యానర్ తో ముందుకు
- తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పాదయాత్ర చేశామన్న దంపతులు
తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ సీఎం కేసీఆర్ మార్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆయన ప్రకటించారు. అందుకే బీఆర్ఎస్ గా మార్చినట్లు చెప్పారు. ఇప్పటికే ఏపీ శాఖకు, మహారాష్ట్ర కిసాన్ సెల్ కు అధ్యక్షులను నియమించారు.
ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని విదర్భలో బాబారావు, శోభ మస్కీ దంపతులు ఒంటిపై సంకెళ్లతో పాదయాత్ర చేస్తున్నారు. ‘కేసీఆర్ రావాలి.. సంకెళ్లు తెంచాలి’ అని రాసి ఉన్న బ్యానర్ చేతపట్టుకుని హైదరాబాద్ వైపు పాదయాత్రగా సాగుతున్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తమ కష్టాలకు విముక్తి కల్పించాలని మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా రాజురా నియోజకవర్గానికి చెందిన బాబారావు, శోభ మస్కీ దంపతులు కోరుతున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టాలంటే బీఆర్ఎస్ రావాలని అంటున్నారు.
రాజురా నియోజకవర్గం నుంచి హైదరాబాద్ వరకు చేపట్టిన పాదయాత్ర ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఆదిలాబాద్ పట్టణంలో మీడియాతో వారు మాట్లాడారు. తాము సీఎం కేసీఆర్ అభిమానులమని, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉద్యమానికి మద్దతు తెలుపుతూ విదర్భ నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టామని వివరించారు. అప్పుడు కేసీఆర్ను కలిశామని బాబారావు గుర్తు చేసుకున్నారు.