Raghu Rama Krishna Raju: వివేకా హత్య కేసులో ఒక స్పష్టత రాబోతోంది: రఘురామకృష్ణరాజు
- త్వరలో గంగిరెడ్డి పిటిషన్ వస్తోందన్న రఘురామ
- షర్మిల వ్యాఖ్యలను ప్రస్తావించిన వైనం
- ఏపీ లిక్కర్ వ్యవహారంపై కేంద్రం దృష్టిసారించాలని విజ్ఞప్తి
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పలు అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల నిన్న ఒక టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారని, వివేకా మరణం వైఎస్సార్ కుటుంబానికి బాధాకరమైన విషయం అని అన్నారని వెల్లడించారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని షర్మిల స్పష్టంగా చెప్పిందని అన్నారు.
ఈ వ్యవహారంలో త్వరలో గంగిరెడ్డి పిటిషన్ కూడా వస్తోందని, వివేకా హత్య కేసులో ఒక స్పష్టత రాబోతోందని రఘురామ పేర్కొన్నారు.
ఇతర అంశాలపై స్పందిస్తూ... ఏపీలో వేల కోట్ల రూపాయల లిక్కర్ బిజినెస్ జరుగుతోందని తెలిపారు. 3 వేల వైన్ షాపులు ఉంటే, 11 షాపులకు డిజిటల్ చెల్లింపుల విధానం ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఏపీ లిక్కర్ వ్యవహారంపై కేంద్రం దృష్టి సారించాలని రఘురామ కోరారు.
సీఎం జగన్ పట్టభద్రుల ఓటు హక్కు తీసుకోలేదని, పులివెందుల వెళ్లి ఓటు తీసుకోవాల్సి ఉండడంతో, అంత ఖర్చు ఎందుకని అనుకుని ఉంటాడు అని వ్యంగ్యం ప్రదర్శించారు.
ఇక, సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై గూగుల్ టేక్ ఔట్ ఉపయోగించి చర్యలు తీసుకోవాలని అన్నారు. సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని తాను కేంద్రానికి లేఖ రాశానని రఘురామ గుర్తు చేశారు. ఇదే అంశంపై డీజీపీకి చీఫ్ సెక్రటరీ లేఖ రాశారని వెల్లడించారు.