Shashi Tharoor: శశిథరూర్ కార్యక్రమం.. డిక్షనరీతో వచ్చిన యువకుడు.. ఇదిగో వీడియో!
- నాగాలాండ్ లో ఓ టాక్ షోలో పాల్గొన్న శశిథరూర్
- ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ తీసుకొచ్చిన యువకుడు
- గతంలో చిత్రమైన ఇంగ్లిష్ పదాలు చెప్పిన శశిథరూర్
శశి థరూర్.. కాంగ్రెస్ నేత, తిరువనంతపురం ఎంపీ. అంతేనా.. అంటే ఇంకా ఉంది. రచయిత, సివిల్ సర్వెంట్, డిప్లమాట్ కూడా. ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడగలరు. ఎంతలా అంటే.. ఆయన పద ప్రయోగాలు అర్థం కాక డిక్షనరీలో, ఇంటర్నెట్ లో వెతికేంత! కొత్త, అతి పెద్ద పదాలను చెబుతుంటారు. శశిథరూర్ పాల్గొనే కార్యక్రమానికి వెళ్తే వెంట ఒక నిఘంటువును తీసుకెళ్లడం మంచిదంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?
నాగాలాండ్ లో ఆర్.లంగ్ లెంగ్ అనే వ్యక్తి నిర్వహించిన టాక్ షోలో శశిథరూర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన యువకులతో ఆయన ముచ్చటించారు. అందులో పాల్గొన్న యువకుల్లో ఒకరు నిజంగానే ఆక్స్ఫర్డ్ డిక్షనరీతో వెళ్లారు.
ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఆర్.లంగ్ లెంగ్ వెల్లడించారు. ‘‘డాక్టర్ శశిథరూర్ చెప్పేది వినడానికి నాగాలాండ్‌లో ఎవరో ఆక్స్ఫర్డ్ డిక్షనరీని నా షోకి తీసుకొచ్చారు. డిక్షనరీని తీసుకురావడం కేవలం జోక్ అని అనుకున్నా. ఇది చూశాక నిజమని తెలిసింది’’ అని ఆయన పేర్కొన్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
గతంలో పలు చిత్ర విచిత్ర పదాలను చెప్పి శశిథరూర్ ఆశ్చర్యపరిచారు. బీజేపీకి ‘అలోడాక్సాఫోబియా (allodoxaphobia)’ ఉందని అన్నారు. అంటే ‘అభిప్రాయాలపై అనవసరంగా భయపడటం’ అని గూగుల్ చెబుతోంది. గతంలో ఒకసారి floccinaucinihilipilification అనే పలకడానికి కూడా రాని పదాన్ని చెప్పారు. దీనికి ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో ‘ఏదైనా పనికి రానిదిగా అంచనా వేసే చర్య లేదా అలవాటు’ అని అర్థం ఉంది. మరి అట్లుంటది శశిథరూర్ తోటి!