Sourav Ganguly: స్వదేశంలో సరిగా ఆడకపోతే తిట్లు తప్పవు: కేఎల్ రాహుల్ కు గంగూలీ సూచన
- ఇటీవల వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్
- రాహుల్ అంచనాలు భారీగా ఉన్నాయన్న గంగూలీ
- గతంలో పలువురు ఆటగాళ్లు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారని వెల్లడి
- మరిన్ని అవకాశాలు ఇస్తే రాణిస్తాడని వ్యాఖ్యలు
ప్రతిభకు లోటు లేకపోయినా, ఫామ్ లో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ పరిస్థితిపై క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ స్పందించాడు. మాజీ క్రికెటర్లు అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పినప్పుడు, ఆ స్థానంలోకి వచ్చిన కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయని తెలిపాడు. ముఖ్యంగా, వరుసగా విఫలమవుతున్నప్పుడు విమర్శల దాడి కూడా అదేస్థాయిలో ఉంటుందని పేర్కొన్నాడు.
"సొంతగడ్డపై ఆడేటప్పుడు పరుగులు సాధించకపోతే తిట్లు తప్పవు. కేఎల్ రాహుల్ ఒక్కడే కాదు... గతంలోనూ ఇలాంటి పరిస్థితిని చాలామంది ఆటగాళ్లు ఎదుర్కొన్నారు. కేఎల్ రాహుల్ అనేక మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు... కానీ, టీమిండియాలో ఓ టాప్ ఆర్డర్ బ్యాట్స్ మన్ నుంచి ఇంకా ఆశిస్తారు. విఫలమైతే విమర్శలు కొత్తేమీ కాదు. ఈ పరిస్థితిని అధిగమించగల సత్తా కేఎల్ రాహుల్ కు ఉందని భావిస్తున్నాను. అతడికి మరిన్ని అవకాశాలు ఇస్తే పరుగులు సాధించడానికి వీలవుతుంది" అని గంగూలీ అభిప్రాయపడ్డాడు.