AP High Court: కోర్టు ధిక్కరణ కేసు.. హైకోర్టు విచారణకు హాజరైన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

AP DGP Rajendranath Reddy attended to High Court for hearing
  • ఇన్‌స్పెక్టర్ పదోన్నతి విషయంలో కోర్టు ఆదేశాలను పట్టించుకోని డీజీపీ
  • కాన్ఫిడెన్షియల్ రిపోర్టు సరిగా లేనందునే ప్రమోషన్‌ను పరిగణనలోకి తీసుకోలేదన్న ప్రభుత్వ న్యాయవాది
  • కౌంటర్ దాఖలకు సమయం కోరిన వైనం
  • తదుపరి విచారణ నుంచి డీజీపీకి మినహాయింపు
కోర్టు ధిక్కరణ కేసుల్లో హైకోర్టు మెట్లు ఎక్కుతున్న ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఓ కేసులో విచారణకు హాజరయ్యారు. పోలీసు ఇన్‌స్పెక్టర్ పదోన్నతి వ్యవహారంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో నిన్న ఆయన న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. 

ఇన్‌స్పెక్టర్ పదోన్నతి విషయంలో కోర్టు ఆదేశాలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని అభిప్రాయపడిన న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కాగా, ఇదే కేసులో మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ కూడా హాజరు కావాల్సి ఉండగా ఆయన ఓ సమావేశం కోసం కేరళ వెళ్లారు. దీంతో ఆయనకు విచారణ నుంచి మినహాయింపు కోరుతూ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. 

ఇక, ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఇన్‌స్పెక్టర్ సీహెచ్ రాజశేఖర్‌కు 1999లో జారీ చేసిన జీవో 257 ప్రకారం పదోన్నతి కల్పించాల్సి ఉందని, కాబట్టి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని 24 సెప్టెంబరు 2019లో హైకోర్టు ఆదేశించింది. అయితే, ఏళ్లు గడుస్తున్నా హైకోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో రాజశేఖర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. 

విచారణ జరిపిన న్యాయస్థానం మాజీ డీజీపీ గౌతం సవాంగ్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి విచారణకు స్వయంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే డీజీపీ హాజరయ్యారు. కాగా, రాజశేఖర్ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్టు బాగా లేనందునే ఆయన పదోన్నతి వ్యవహారాన్ని ప్రమోషనల్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు సమయం ఇవ్వాలని కోరడంతో కోర్టు అందుకు అంగీకరిస్తూ విచారణను వాయిదా వేసింది. అయితే, తర్వాతి విచారణ నుంచి డీజీపీకి మినహాయింపు ఇచ్చింది.
AP High Court
AP DGP
Rajendranath Reddy
Gautam Sawang

More Telugu News