car loan: తక్కువ వడ్డీకి కారు లోన్ ఇచ్చే టాప్ 5 బ్యాంకులు ఇవే!
- లోన్ మంజూరు విధానాన్ని సులభతరం చేసిన బ్యాంకులు
- ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ రేటు
- ప్రైవేటు బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంకు బెస్ట్
కొత్త కారు కొనేందుకు చాలామంది బ్యాంకు లోన్ పై ఆధారపడతారు. ఇప్పుడు బ్యాంకులు కూడా లోన్ మంజూరు విధానాన్ని సులభతరం చేశాయి. అయితే, ఫోర్ వీలర్ కొనడానికి ఒక్కో బ్యాంకు ఒక్కో వడ్డీ రేటుతో లోన్ ఆఫర్ చేస్తున్నాయి. తరచుగా తమ కస్టమర్లకు ఫోన్ ద్వారా లోన్ వివరాలను చెబుతున్నాయి. మార్కెట్ లో ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులలో ఏ బ్యాంకు తక్కువ వడ్డీతో ఫోర్ వీలర్ రుణం మంజూరు చేస్తోంది.. ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే వడ్డీ భారం తగ్గుతుంది.. అనేది తెలుసుకోవడం కొంచెం కష్టమైన పనే అని చెప్పొచ్చు.
ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీతో కారు లోన్ ఇచ్చే 5 బెస్ట్ బ్యాంకుల వివరాలు మీకోసం..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిగతా బ్యాంకులతో పోలిస్తే తక్కువ వడ్డీకే కారు లోన్ ఇస్తోంది. తన ఖాతాదారులకు 8.65 శాతం వడ్డీ రేటుతో కారు రుణాలను అందిస్తోంది. ఎస్ బీఐ నుంచి కారు లోన్ తీసుకుంటే ప్రతీ లక్ష రూపాయలకు నెలనెలా చెల్లించాల్సిన ఈఎంఐ రూ.2,472 (దాదాపుగా).
యాక్సిస్ బ్యాంక్..
ప్రైవేట్ బ్యాంకుల విషయానికి వస్తే కొత్త కారు కొనేందుకు రుణం తీసుకోవడానికి యాక్సిస్ బ్యాంక్ ను ఎంచుకోవడం మేలని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. తన కస్టమర్లకు కనీసం 8.50 శాతం వడ్డీతో యాక్సిస్ బ్యాంకు కారు లోన్‌ను అందిస్తోంది. తీసుకున్న రుణంలో ప్రతీ రూ.లక్షకు నెలనెలా రూ.2,465 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా..
మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉంటే తక్కువ వడ్డీకే కారు లోన్ తీసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు 8.70 శాతం వడ్డీతో అందిస్తోంది. అంటే రూ. 1 లక్షపై, మీ నెలవారీ ఈఎంఐ దాదాపు రూ. 2,474 అవుతుంది.
ఐసీఐసీఐ..
ప్రైవేట్ రంగంలోని టాప్ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ కొత్త కారు కొనే వారికి 8.75 శాతం వడ్డీతో రుణం అందిస్తోంది. ఈ బ్యాంకు నుంచి కార్ లోన్ తీసుకుంటే నెలనెలా ఈఎంఐ కింద ప్రతీ లక్ష రూపాయల రుణానికి రూ.2,477 చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ఫోర్ వీలర్ రుణాలను కనీసం 8.85 శాతం వడ్డీతో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫర్ చేస్తోంది. ఈ బ్యాంకు రుణంతో కొత్త కారు కొంటే ప్రతీ లక్ష రూపాయల రుణానికి రూ.2,481 ఈఎంఐ కింద నెలనెలా చెల్లించాలి.