pomegranates: రోజూ దానిమ్మ తింటే.. గుండె బలం!
- దానిమ్మలో యాంటీ అథెరోజెనిక్ ప్రాపర్టీలు
- వీటితో గుండె రక్త నాళాలు శుభ్రం
- యాంటీ ఆక్సిడెంట్లతో రక్షణ
- జీవనశైలి, ఆహారంలోనూ మార్పులు అవసరం
దానిమ్మ పండు మన ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే పండ్లలో ఒకటి. ముఖ్యంగా నేడు గుండె ఆరోగ్యం ఎక్కువ రిస్క్ ఎదుర్కొంటోంది. ఆహారం, నిద్ర వేళల్లో వచ్చిన మార్పులు, ఒత్తిడి ఇవి గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. కనుక గుండె ఆరోగ్యాన్ని కాపాడే దానిమ్మ పండ్లను రోజూ తినాలని పోషకాహార నిపుణుల సూచన.
ప్రతి రోజూ మూడు దానిమ్మ పండ్లు తినడం వల్ల గుండెకు మంచి జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. లేదంటే కనీసం రోజుకు ఒక దానిమ్మ పండు అయినా తినాలి. మరోవైపు జీవనశైలి, ఆహారంలోనూ మార్పులు చేసుకోవాలి. దానిమ్మలో యాంటీ అథెరోజెనిక్ ప్రాపర్టీలు ఉంటాయి. అంటే గుండె రక్త నాళాల్లో ప్లాక్యూ (కొవ్వు ఫలకాలు) ఏర్పడకుండా నివారిస్తాయి. ఇప్పటికే ఏర్పడి ఉంటే శుభ్రం చేస్తాయి. దీనివల్ల రక్తపోటు కూడా నియంత్రణలోకి వస్తుంది.
దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్లు సైతం ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఒకవైపు దానిమ్మ పండ్లను నిత్యం తింటూనే, మరోవైపు తీసుకునే ఆహారంలో తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ట్రాన్స్ ఫ్యాట్, శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న వాటికి దూరంగా ఉండాలి. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే మద్యపానం, సిగరెట్ మానివేయాలి. ఈ మార్పులతో గుండె ఆరోగ్యంలోనూ మార్పును గమనించొచ్చు.