Bopparaju Venkateswarlu: ఏపీ సీఎస్ ను కలిసి ఉద్యమ నోటీసులు ఇచ్చిన ఉద్యోగ సంఘం నేతలు
- డిమాండ్ల సాధన కోసం ఉద్యోగుల ఉద్యమ బాట
- మార్చి 9 నుంచి ఉద్యమ కార్యాచరణ
- ఉద్యోగులంతా డిమాండ్ల సాధనకు ఉద్యమించాలన్న బొప్పరాజు
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం నేతలు ఇవాళ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డిని కలిశారు. ఆయనకు తమ ఉద్యమ కార్యాచరణ నోటీసులు అందజేశారు.
ఉద్యోగుల ఆర్థికపరమైన, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ ఉద్యమం చేపడుతున్నట్టు నోటీసుల్లో పేర్కొన్నారు. మార్చి 9 నుంచి ఉద్యమ కార్యాచరణ షురూ అవుతుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏపీజేఏసీ అమరావతి ఉద్యోగ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులంతా తమ డిమాండ్ల సాధనకు ఆందోళన బాటపట్టాలని పిలుపునిచ్చారు. ముందుగా సెల్ డౌన్, పెన్ డౌన్, భోజన విరామ నిరసనలు చేపడుతున్నట్టు తెలిపారు. ఆ తర్వాత కలెక్టరేట్లలో స్పందన దరఖాస్తులు ఇస్తామని వెల్లడించారు.
అప్పటికీ తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఈసారి చాయ్ బిస్కట్ సమావేశాలతో రాజీపడే ప్రసక్తేలేదని తమ వైఖరిని వెల్లడించారు.