Gangster Atiq Ahmed: జైలు నుంచి బయటికి తరలిస్తే నన్ను చంపేస్తారు: భయంతో వణికిపోతున్న యూపీ మాజీ ఎమ్మెల్యే
- వారం రోజుల క్రితం ఉమేశ్ పాల్ హత్య
- 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ సింగ్ హత్యకేసులో ఉమేశ్ ప్రత్యక్ష సాక్షి
- ఉమేశ్ పాల్ హత్య కేసు నిందితుల్లో ఒకరి ఎన్కౌంటర్
- తాను కూడా ఎన్కౌంటర్ అయిపోతానన్న భయంతో కోర్టును ఆశ్రయించిన అష్రాఫ్
తనను జైలు నుంచి బయటకు తరలిస్తే చంపేయడం ఖాయమంటూ రాజకీయ నాయకుడిగా మారిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్ సోదరుడు అష్రాఫ్ తెగ భయపడిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే అయిన ఆయన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని బరేలీ జైలులో ఉన్నారు. తనను జైలు బయటకు తరలించాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన కోర్టును ఆశ్రయించారు. తనను జైలు నుంచి బయటికి తరలిస్తే దారిలోనే చంపేయడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు.
గత వారం ప్రయాగ్రాజ్లో జరిగిన ఉమేశ్ పాల్ హత్య కేసులో అష్రాఫ్, ఆయన సోదరుడైన అతీక్ అహ్మద్ ఇద్దరికీ సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2005లో హత్యకు గురైన బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ కేసులో ఉమేశ్ పాల్ ప్రత్యక్ష సాక్షి. అలహాబాద్ (వెస్ట్) అసెంబ్లీ స్థానం నుంచి రాజు పాల్ విజయం సాధించిన కొన్ని నెలలకే ఆయన హత్యకు గురయ్యారు. మాజీ ఎంపీ అయిన అతీక్ అహ్మద్ తమ్ముడు ఖాలిద్ అజీంపై పాల్ ఘన విజయం సాధించారు.
ఈ కేసులో అతీక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రాఫ్ ప్రధాన నిందితులు. వీరిద్దరూ ఇప్పుడు జైలులో ఉన్నారు. అష్రాఫ్ బరేలీ జైలులో ఉండగా, అతీక్ సబర్మతి జైలులో ఉన్నారు. విచారణ కోసం లేదంటే జైలు బదిలీ కోసం తరలించాలన్న అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అష్రాఫ్ కోర్టును ఆశ్రయించారు. బయటకు తరలిస్తే దారిలోనే తనను చంపేయడం ఖాయమని అందులో ఆందోళన వ్యక్తం చేశారు. ఉమేశ్ పాల్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడు ఉత్తరప్రదేశ్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ నేపథ్యంలో అష్రాఫ్ భయంతో కోర్టును ఆశ్రయించారు.