Andhra Pradesh: వైఎస్ వివేకా హత్య కేసు.. భాస్కర్ రెడ్డికి మరోమారు సీబీఐ నోటీసులు
- పులివెందులలో ఇంటికెళ్లి అందించిన అధికారులు
- ఈ నెల 12న విచారణకు రావాలని సూచన
- గత నెలలో నోటీసులు జారీ చేయగా సమయం కోరిన భాస్కర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మరోమారు నోటీసులు జారీ చేసింది. పులివెందులలోని భాస్కర్ రెడ్డి ఇంట్లో మంగళవారం సాయంత్రం ఈ నోటీసులను అధికారులు అందజేశారు. ఈ నెల 12న కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరు కావాలని నోటీసులలో సీబీఐ పేర్కొంది. ఈ కేసులో విచారణకు రావాలంటూ గత నెల 18న నోటీసులు జారీ చేయగా.. కొంత సమయం కావాలంటూ భాస్కర్ రెడ్డి కోరారు.
ముందస్తు కార్యక్రమాలతో బిజీగా ఉన్నందు వల్ల విచారణకు రాలేనని చెప్పారు. దీంతో సీబీఐ తాజాగా మరోమారు నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి కుమారుడు, ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ఇప్పటికే రెండుసార్లు విచారించారు. ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైఎస్ భారతి పీఏ నవీన్ లను కూడా అధికారులు ఇప్పటికే విచారించారు. ఈ నేపథ్యంలో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా వైఎస్ భాస్కర్ రెడ్డిని అధికారులు ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.