Team India: కోహ్లీ, భరత్​ కూడా ఔట్... లంచ్ విరామానికి 84/7తో నిలిచిన భారత్​

India 84 for 7 at lunch

  • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • ఆసీస్ స్పిన్నర్లు కునెమన్, లైయన్ చెరో 3 వికెట్లు
  • తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన టీమిండియా 

ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో భారత్ బ్యాటింగ్ లో నిరాశ పరుస్తోంది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్ లో ఏడుగురు పెవిలియన్ చేరడంతో భారత్ 84/7తో లంచ్ విరామానికి వెళ్లింది. ఇండోర్ హోల్కర్ స్టేడియం పిచ్ పై ఆసీస్ స్పిన్నర్లు కునెమన్, లైయన్ బంతిని తిప్పేస్తున్నారు. ఈ ఇద్దరూ చెరో మూడు వికెట్లు పడగొట్టడంతో భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. కెప్టెన్ రోహిత్  12 పరుగులే చేసి ఆరో ఓవర్లో కునెమన్ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన శుభ్ మన్ గిల్ (21) అతని బౌలింగ్ లోనే  స్మిత్ కు క్యాచ్ ఇవ్వగా.. తర్వాతి ఓవర్లోనే పుజారా (1)ను నేథన్ లైయన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 

ఈ దశలో క్రీజులో వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజులో కుదురుకున్నా.. వికెట్ల పతనం ఆగలేదు. రవీంద్ర జడేజా (4)ను లైయన్ ఔట్ చేయగా.. శ్రేయస్ అయ్యర్ (0)ను కునెమన్ డకౌట్ చేయడంతో భారత్ 11.2 ఓవర్లలో 45 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్ (17)  తో కలిసి విరాట్ కోహ్లీ (22) ఆరో వికెట్ కు 25 పరుగులు జోడించడంతో భారత్ కోలుకునేలా కనిపించింది. కానీ, 22వ ఓవర్లో కోహ్లీని ఎల్బీ చేసిన మర్ఫీ ఈ జోడీని విడదీశాడు. ఆ వెంటనే లైయన్ బౌలింగ్ లో కేఎస్ భరత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం అక్షర్ పటేల్ (6), అశ్విన్ (1) క్రీజులో ఉన్నారు. కాగా, తొలి రెండు టెస్టుల్లో నెగ్గిన భారత్ నాలుగు మ్యాచ్ ల సిరీస్ లో ప్రస్తుతం 2–0తో ఆధిక్యంలో ఉంది.

  • Loading...

More Telugu News