Andhra Pradesh: ఉద్యోగుల జీతాలు ప్రభుత్వ అనుగ్రహంతో ఇచ్చేవి కాదు: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
- జీతాలు ఉద్యోగుల హక్కు అన్న సూర్యనారాయణ
- జీతాల విషయంలో అసెంబ్లీలో చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్
- ఉద్యోగుల జీపీఎఫ్ కూడా ఖాతాల్లో ఉండటం లేదని మండిపాటు
ఉద్యోగుల జీతాల చెల్లింపుల్లో ప్రభుత్వం ప్రతి నెలా ఆలస్యం చేస్తోందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ విమర్శించారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని... ఈ విషయంలో ఆందోళనకు వెళ్తున్నామని చెప్పారు. ఉద్యోగులకు జీతాలనేవి ప్రభుత్వ అనుగ్రహంతో ఇచ్చేవి కాదని... జీతాలు ఉద్యోగుల హక్కు అని అన్నారు.
జీతాల విషయంలో రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చట్టబద్ధత తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల ఒకటో తేదీనే ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లను చెల్లించేలా చట్టం చేయాలని అన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ కూడా కేవలం పేపర్ల పైనే ఉంటోందని... ఖాతాల్లో ఉండటం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఏప్రిల్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు ఉద్యోగ సంఘాలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.