Stalin: మూడో ఫ్రంట్ గురించి చర్చించడం కూడా వేస్టే: స్టాలిన్
- కాంగ్రెస్ లేని కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచన సరికాదన్న స్టాలిన్
- బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు కలసి పని చేయాలని సూచన
- అందరం కలిస్తేనే బీజేపీని ఓడించగలమని వ్యాఖ్య
లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ... బీజేపీని నిలువరించేందుకు విపక్షాలు వ్యూహాలను రచిస్తున్నాయి. మరోవైపు మూడో ఫ్రంట్ అంశాన్ని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేతలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేకుండా కూటమిని ఏర్పాటు చేయాలన్న కొన్ని పార్టీల ఆలోచన సరికాదని అన్నారు. కాంగ్రెస్ తో కూడిన కూటమే విజయం సాధిస్తుందని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ కు అర్థమే లేదని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ కలసి రావాలని స్టాలిన్ చెప్పారు. రానున్న ఎన్నికలు అత్యంత కీలకమైనవని... దీన్ని గ్రహించి ప్రతిపక్షాలు కలసికట్టుగా పని చేయాలని అన్నారు. అందరూ ఒక్కతాటిపైకి వస్తేనే బీజేపీని ఓడించగలమని చెప్పారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి లోక్ సభ ఎన్నికలకు ముందే చేతులు కలపాలని... ఎన్నికల తర్వాత కలవడమనేది సాధ్యం కాదని అన్నారు. థర్డ్ ఫ్రంట్ గురించి చర్చించడం కూడా వేస్ట్ అని అభిప్రాయపడ్డారు.