Team India: 11 పరుగుల తేడాతో ఆరుగురు ఔట్.. 197 స్కోరుకే ఆసీస్ ఆలౌట్
- చెలరేగిన అశ్విన్, ఉమేశ్ యాదవ్
- తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ కు 88 పరుగుల ఆధిక్యం
- 13/0తో లంచ్ బ్రేక్ కు వెళ్లిన భారత్
ఆస్ట్రేలియాతో మూడో టెస్టు రెండో రోజు భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ చెరో మూడు వికెట్లతో కంగారూలకు అడ్డుకట్ట వేసి భారత్ ను రేసులోకి తెచ్చారు. ఓ దశలో 186/4తో భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆసీస్.. ఈ ఇద్దరి దెబ్బకు 11 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు కోల్పోయింది. దాంతో, ఆస్ట్రేలియా 197 పరుగుల వద్ద ఆలౌటైంది. పర్యవసానంగా, ఆసీస్ కు 88 పరుగుల ఆధిక్యం దక్కింది. ఓవర్ నైట్ స్కోరు 156/4తో ఆట కొనసాగించిన ఆసీస్ కు రెండో రోజు ఉదయం ఓవర్ నైట్ బ్యాటర్లు పీటర్ హ్యాండ్స్ కోంబ్ (19), కామెరూన్ గ్రీన్ (21) మంచి ఆరంభమే ఇచ్చారు.
అయితే, హ్యాండ్స్ కోంబ్ ను ఔట్ చేసిన అశ్విన్ భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. అక్కడి నుంచి ఆసీస్ పతనం మొదలైంది. ఓవైపు అశ్విన్, మరోవైపు పేసర్ ఉమేశ్ యాదవ్ చెలరేగారు. అలెక్స్ క్యారీ (3), నేథన్ లైయన్ (5)ని కూడా అశ్విన్ ఔట్ చేశారు. గ్రీన్ తో పాటు మిచెల్ స్టార్క్ (3), టాడ్ మర్ఫీ (0)లను ఉమేశ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ కు వచ్చిన భారత్ లంచ్ విరామ సమయానికి 13/0 స్కోరుతో నిలిచింది. భారత్ ఇంకా 75 పరుగులు వెనుకబడి ఉంది.