Mallikarjun Kharge: మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఖర్గే స్పందన
- నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో విజయం దిశగా బీజేపీ
- వీటి ఫలితాలు లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న విశ్లేషకులు
- ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కేంద్ర ప్రభుత్వం వైపు మొగ్గుచూపుతారన్న ఖర్గే
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్ శాసనసభలకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈరోజు కొనసాగుతోంది. వీటిలో నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో విజయం దిశగా బీజేపీ సాగుతోంది. మరోవైపు ఈ ఎన్నికల ఫలితాలు రానున్న లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అయితే ఈ అంశంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ... లోక్ సభ ఎన్నికలపై వీటి ప్రభావం ఉండదని చెప్పారు. సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల ప్రజలు కేంద్ర ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతుంటారని తెలిపారు. అయితే ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా మంది నేతలు జాతీయ రాజకీయాలకు కట్టుబడి ఉంటారని... ఇలాంటి వారంతా లౌకికవాద పార్టీలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలకు మద్దతుగా ఉంటారని చెప్పారు.