Honda City: హోండా సిటీ కారు మళ్లీ వస్తోంది... ఈసారి కొత్తగా!
- పాత హోండా సిటీ మోడల్ నిలిపివేత
- బీఎస్6 ప్రమాణాలతో కొత్త హోండా సిటీ
- అడాస్ తదితర అత్యాధునిక ఫీచర్లతో నయా మోడల్
- పెట్రోల్, హైబ్రిడ్ వేరియంట్లలో హోండా సిటీ-2023
మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన కారు హోండా సిటీ. ఇప్పుడీ కారును హోండా సరికొత్తగా ముస్తాబు చేసి మళ్లీ తీసుకువస్తోంది. అనేక ఆధునిక ఫీచర్లతో, ఆకట్టుకునే డిజైన్ తో రూపుదిద్దిన హోండా సిటీ-2023 ఫేస్ లిఫ్ట్ మోడల్ ఇటీవలే విడుదలైంది.
ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి పెట్రోల్ వెర్షన్ కాగా, మరొకటి హైబ్రిడ్. స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ లో ఎస్వీ, వి, వీఎక్స్, జడ్ఎక్స్ వేరియంట్లు ఉన్నాయి. హైబ్రిడ్ వెర్షన్ లో వి,జడ్ ఎక్స్ వేరియంట్లు ఉన్నాయి.
సరికొత్త హోండా సిటీ కారులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఫీచర్... అడాస్ (అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్). పెట్రోల్ వెర్షన్ లోని ఎస్వీ వెర్షన్ ను మినహాయిస్తే... వి, వీఎక్స్, జడ్ ఎక్స్ వెర్షన్లలో అడాస్ ను పొందుపరిచారు. అడాస్ కు కొలిషన్ మిటిగేషన్ బ్రేకింగ్ సిస్టమ్ (సీఎంబీఎస్) ను కూడా అనుసంధానించారు. సెల్ఫ్ డ్రైవింగ్ లో మరింత కచ్చితత్వానికి ఇది దోహదపడనుంది.
అడాస్ లో భాగంగా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్టెంట్ సిస్టమ్, లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్, రోడ్ డిపార్చర్, మిటిగేషన్ సిస్టమ్, ఆటో హై బీమ్ ఫీచర్లను జోడించారు. లీడ్ కార్ డిపార్చర్ నోటిఫికేషన్ సిస్టమ్ అనేది పెట్రోల్, హైబ్రిడ్ రెండు వేరియంట్లలోనూ ఉంది. ఇది పూర్తిగా కొత్త ఫీచర్.
ఇక, పాత హోండా సిటీ బీఎస్4 ప్రమాణాలతో కూడుకున్నది కాగా, కొత్త హోండా సిటీని బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు. పైగా ఇందులో, రియల్ టైమ్ డేటా ఎమిషన్ (ఆర్డీఈ) ఫీచర్ కూడా ఉంది.
హోండా సిటీ కొత్త కారు ప్రారంభ ధర రూ.11.49 లక్షలు (ఎక్స్ షోరూం) అని తెలుస్తోంది. అత్యధికంగా జడ్ఎక్స్ మోడల్ రూ.20.39 లక్షలుగా పేర్కొన్నారు. ఇది ఢిల్లీ ఎక్స్ షోరూం ధర.