Venkatrami Reddy: నన్నే ఓడించలేకపోయారు.. ఇక జగన్నేం ఓడిస్తారు? : ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి
- తాను జగన్ కు నమ్మినబంటునని చెప్పిన వెంకట్రామిరెడ్డి
- చంద్రబాబు హయాంలో మూడు కులాల అధికారులపై దాడులు జరిగాయని ఆరోపణ
- పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఏపీ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సామాజికవర్గానికి చెందిన ఉద్యోగ సంఘాల నేతలపై ఎలాంటి ఏసీబీ దాడులను చేయించలేదని... మూడు కులాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేయించారని ఆరోపించారు. తాను ముఖ్యమంత్రి జగన్ కు నమ్మినబంటునని చెప్పారు. ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో తననే ఓడించలేకపోయారని... ఇక వచ్చే ఎన్నికల్లో జగన్నేమి ఓడిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని వెంకట్రామిరెడ్డి కోరారు. రెగ్యులర్ ఉద్యోగులకు కొంచెం ఆలస్యంగా జీతాలు పడుతున్నప్పటికీ... చిన్న స్థాయి ఉద్యోగులకు మాత్రం ఒకటో తేదీనే జీతాలు అందుతున్నాయని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక్క నెలలోనైనా సరిగ్గా జీతాలు పడ్డాయా? అని ప్రశ్నించారు. మరోవైపు ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నెల 9న వారు ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారు. తొలి విడతలో సెల్ డౌన్, పెన్ డౌన్, లంచ్ బ్రేక్ లో ఆందోళనలు చేపడుతున్నట్టు అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.