football: సొంత నగరంలో ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీకి బెదిరింపు లేఖ
- మెస్సీ భార్య కుటుంబానికి చెందిన సూపర్ మార్కెట్ పై కాల్పులు
- మూసి ఉన్న స్టోర్ పై తెల్లవారుజామున 14 రౌండ్ల కాల్చిన ఇద్దరు దుండగులు
- దాడితో నగరంలో గందరగోళం సృష్టించేందుకే ఈ చర్య అంటున్న మేయర్
అర్జెంటీనాకు సాకర్ ప్రపంచ కప్ అందించిన ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ భార్యకు చెందిన సూపర్ మార్కెట్ పై ఇద్దరు ఆగంతుకులు కాల్పులు జరిపారు. మెస్సీ సొంత నగరం రొసారియోలో మూసి ఉన్న ఈ స్టోర్ పై గురువారం అర్ధరాత్రి 14 బుల్లెట్లు కురిపించారు. మెస్సీకి ఓ బెదిరింపు లేఖను వదిలి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘మెస్సీ, మేం మీ కోసం ఎదురు చూస్తున్నాము. జావ్కిన్ ఓ నార్కో (డ్రగ్ డీలర్), అతను మిమ్మల్ని కాపాడలేడు’ అని ఆ లేఖలో రాశారు.
దుండగులు కాల్పులు జరిపిన సూపర్ మార్కెట్ మెస్సీ భార్య ఆంటోనెలా రోకుజో కుటుంబానికి చెందినదిగా నగర మేయర్ జావ్ కిన్ ధ్రువీకరించారు. అయితే, ఈ దాడి యొక్క లక్ష్యం నగరంలో గందరగోళం సృష్టించడమేనని అన్నారు. ‘ఈ దాడితో నగరంలో గందరగోళం సృష్టించడం తప్పితే వాళ్లకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మెస్సీపై దాడి కంటే ప్రపంచంలో ఏ కథ వేగంగా వైరల్ అవుతుంది? ఇలాంటి ఘటనలు కొంతకాలంగా జరుగుతూనే ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. కాగా, అర్ధరాత్రి మూడు గంటల మధ్య ఇద్దరు వ్యక్తులు మోటార్‌బైక్‌పై వచ్చినట్లు ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. ఒకరు బైక్ దిగి కాల్పులు జరిపి, నోట్‌ను పడేసి వెళ్లిపోయారని తెలిపారు.
ఇది మెస్సీకి బెదిరింపు కాదని, ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం అని పోలీసులు చెబుతున్నారు. కాల్పుల సమయంలో ఆవరణలో ఎవరూ లేకపోవడంతో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. మెస్సీ, రోకుజో కుటుంబానికి ఇదివరకు ఎలాంటి బెదిరింపులు రాలేదన్నారు. కాగా, రోసారియో నగరం పరానా నదిపై ఉన్న ఓడరేవు నగరం. ఇది మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కేంద్రంగా ఉంది. అర్జెంటీనా దేశంలో అత్యంత హింసాత్మక నగరంగా మారింది. 2022లో అక్కడ 287 హత్యలు జరిగాయి.