iPhone: త్వరలో కర్ణాటకలో ఐఫోన్ల తయారీ.. లక్ష మందికి ఉద్యోగాలు!
- 300 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్ కాన్ సంస్థ క్యాంపస్
- బెంగళూరు శివారులో స్థలం కేటాయించిన కర్ణాటక సర్కారు
- ఇప్పటికే తమిళనాడులోని ప్లాంట్ లో ఐఫోన్లను తయారు చేస్తున్న ఫాక్స్ కాన్
యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లు త్వరలో కర్ణాటకలో తయారుకానున్నాయి. ఇందుకోసం 300 ఎకరాల విస్తీర్ణంలో ఫాక్స్ కాన్ సంస్థ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. ఈ తయారీ యూనిట్ అందుబాటులోకి వస్తే లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని తెలిపారు.
ఐఫోన్లను తయారు చేసే సంస్థ ‘ఫాక్స్ కాన్’కు 300 ఎకరాల భూమిని బెంగళూరు శివారులో కర్ణాటక ప్రభుత్వం కేటాయించింది. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ క్యాంపస్ లలో ఒకటిగా చోటుదక్కించుకోనుంది. మరోవైపు ఫాక్స్ కాన్ కు చెందిన ‘హోన్ హయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ’ 700 మిలియన్ డాలర్లను కొత్త ప్లాంట్ లో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తోంది. స్థానికంగా ఉత్పత్తి పెంచేందుకు ఏర్పాట్లు చేస్తోందని ‘బ్లూమ్ బర్గ్’ సంస్థ వెల్లడించింది.
ఈరోజు ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియూతో కూడిన 17 మంది సభ్యుల ప్రతినిధి బృందం.. బెంగళూరు శివారులోని క్యాంపస్ ను సందర్శించింది. ‘‘గ్లోబల్ కంపెనీలు ఇష్టపడే గమ్యస్థానంగా బెంగుళూరు ఉంది. పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రగామిగా ఉంది’’ అని ఈ సందర్భంగా యంగ్ లియూ అన్నారు.
మన దేశంలో ఫాక్స్ కాన్ చేస్తున్న రెండో మేజర్ ఇన్వెస్ట్ మెంట్ ఇది. ఇప్పటికే తమిళనాడులోని ప్లాంట్ లో కొత్త జనరేషన్ ఐఫోన్లను తయారు చేస్తోంది. అమెరికా, చైనా, జపాన్ సహా ప్రపంచవ్యాప్తంగా 24 దేశాల్లో 173 క్యాంపస్ లు ఫాక్స్ కాన్ కు ఉన్నాయి.