Gudivada Amarnath: అచ్చెన్నాయుడు ఏనాడైనా అంబానీ, అదానీలను చూశాడా?: మంత్రి గుడివాడ అమర్నాథ్
- విశాఖలో జీఐఎస్-2023
- మొత్తం రూ.13 లక్షల కోట్ల ఒప్పందాలు జరుగుతున్నాయన్న అమర్నాథ్
- 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని వెల్లడి
- ప్రపంచ పెట్టుబడిదారుల సమావేశానికి రేపు చివరి రోజు
విశాఖలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్-2023)పై టీడీపీ నేతలు విమర్శిస్తుండడం పట్ల రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై ధ్వజమెత్తారు.
ఏనాడైనా అచ్చెన్నాయుడు తన జీవితంలో అంబానీ, అదానీ, దాల్మియాలను చూశాడా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. "అచ్చెన్నాయుడు ఇప్పుడే నిద్రలేచి మాట్లాడుతున్నట్టుంది. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చిన స్పందన పట్ల ప్రశంసించకపోయినా ఫర్వాలేదు కానీ, ఇలా అడ్డగోలుగా విమర్శించడం సరికాదు" అని హితవు పలికారు.
ఇక జీఐఎస్-2023 తొలిరోజు విజయవంతం అయిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. తమ ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ కంపెనీలు ముందుకొచ్చాయని తెలిపారు. 20 రంగాల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపించారని వివరించారు. ఒక్కరోజులో రూ.11.87 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. రెండు రోజుల్లోనూ మొత్తం 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరుగుతాయనీ, వీటి వల్ల 6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మన సహజ వనరులు దోహదం చేస్తాయని అన్నారు. సమావేశాలకు చివరి రోజైన రేపు ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల మధ్య మరో 240 ఒప్పందాలు ఖరారవుతాయని తెలిపారు. టీడీపీ హయాంలో జరిగిన ఎంఓయూలలో 10 శాతం మాత్రమే ప్రారంభమయ్యాయని, అయితే, జగన్ ప్రభుత్వంలో జరిగిన వాటిలో 80 నుంచి 90 శాతం ప్రారంభమయ్యాయని అన్నారు. ఇక ఇప్పుడు చేసుకున్న వాటిలో నూరు శాతం మొదలవుతాయని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు.