Cricket: మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ టైమింగ్ మార్పు... కారణం ఇదే
- అరగంట ఆలస్యంగా రాత్రి 8 గంటల నుంచి జరుగుతుందన్న బీసీసీఐ
- సాయంత్రం 6.25 నుంచి ప్రారంభోత్సవం
- అలరించనున్న బాలీవుడ్ స్టార్స్ కృతి సనన్, కియారా, కెనడా సింగర్ ధిల్లాన్
భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మహిళా క్రికెటర్లు ఎంతగానో ఎదురు చూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు రంగం సిద్ధమైంది. ఈ మెగా లీగ్ ఈ రోజే మొదలవుతుంది. డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ లో ఐదు జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్ లో మొత్తం 22 మ్యాచ్ లు ఉన్నాయి. ఈ నెల 26న ఫైనల్ జరగనుంది. తొలి సీజన్ లో అన్ని మ్యాచ్ లు ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాల్లో షెడ్యూల్ చేశారు. ఈ రోజు జరిగే తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ పోటీ పడనున్నాయి.
అయితే, తొలి మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్ రాత్రి 7.30కి మొదలు కావాల్సింది. కానీ, అరగంట ఆలస్యంగా రాత్రి 8 గంటలకు మొదలవుతుందని తెలిపింది. అలాగే, మ్యాచ్ కు ముందు ప్రారంభోత్సవాన్ని సాయంత్రం 5.30 గంటలకు కాకుండా 6.25 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ కృతి సనన్, కియారా అద్వానీ తో పాటు కెనడా పాప్ సింగర్ ఏపీ ధిల్లాన్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కాగా, ఈ టోర్నీని మిగతా మ్యాచ్ లు ముందుగా నిర్ణయించిన సమయానికే జరుగుతాయి. రాత్రి మ్యాచ్ 7.30 గంటలకు, డబుల్ హెడర్ లో మొదటి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు మొదలవుతుంది.