Nara Lokesh: టీడీపీ వచ్చాక పెట్టుబడుల వరద ఖాయం: నారా లోకేశ్
- పుంగనూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర
- లోకేశ్ తో భేటీ అయిన బీసీ నేతలు, ముస్లింలు, యువత
- టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పెట్టుబడులు వస్తాయన్న లోకేశ్
- మంత్రి పెద్దిరెడ్డిపైనా తీవ్ర విమర్శలు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పుంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇవాళ కొక్కువారి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. తుడుంవారిపల్లిలో బీసీ నాయకులు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కల్లూరు శివార్లలో భోజన విరామ సమయంలో యువతతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముస్లిం మైనారిటీలతో సమావేశమయ్యారు.
ఇందుకే కదా నిన్ను పాపాల పెద్దిరెడ్డి అనేది!
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కంపెనీ టిప్పర్ ఎదుట యువనేత లోకేశ్ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇందుకే కదా నిన్ను పాపాల పెద్దిరెడ్డి అని ప్రజలు అనేది అంటూ విమర్శించారు. "పుంగనూరు నియోజకవర్గంలో రోడ్డుపై చిన్న గుంత పూడ్చాలన్నా, రోడ్డు వేయాలన్నా పెద్దిరెడ్డి సొంత సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్సే చేయాలంట. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే నియంత పెద్దిరెడ్డికి చెందిన ఈ లారీ" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.
అధికారంలోకి రాగానే కేజీ టు పీజీ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కేజీ టు పీజీ విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పిస్తామని లోకేశ్ పేర్కొన్నారు. పుంగనూరు నియోజకవర్గం కల్లూరులో యువతీయువకులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చాక పోటీపరీక్షలను ఎదుర్కొనే విధంగా సిలబస్ ను మార్పుచేస్తామని వెల్లడించారు.
"చిత్తూరుకు స్పోర్ట్స్ యూనివర్శిటీ తీసుకొస్తాం. క్రీడలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. ఉమ్మడి ఏపీలో పుల్లెల గోపీచంద్ కు భూమి కేటాయించి అకాడమీ పెట్టిస్తే మన దేశానికి ఒలింపిక్స్ లో మెడల్స్ వచ్చాయి. ఏపీని ఐటీ హబ్ గా తీర్చి దిద్దాలనే ఉద్దేశంతో చంద్రబాబు అనేక కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వేలాది ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశారు. మీ కోరిక మేరకు కల్లూరుకు డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీని తీసుకొస్తాం" అని వివరించారు.
టీడీపీ వచ్చాక 100 రోజుల్లో పరిశ్రమలు, పెట్టుబడులు వస్తాయి!
టీడీపీ అధికారంలోకి వచ్చాక పెట్టుబడులు పరిగెత్తుకుంటూ వస్తాయని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో మన రాష్ట్రం వాళ్లే అధికంగా ఉన్నారంటే చంద్రబాబు చలవేనని అన్నారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లిపోతున్నారని తెలిపారు. టీడీపీ పాలనలో అనేక ఒప్పందాలు జరిగాయని, 2019లో మళ్లీ అధికారంలోకి వచ్చుంటే ఇప్పటికే 50 లక్షల ఉద్యోగాలు వచ్చేవని లోకేశ్ వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో పరిశ్రమలు, పెట్టుబడులు పెద్దఎత్తున రాష్ట్రానికి వస్తాయని ధీమాగా చెప్పారు.
యువత భవిష్యత్తున పెద్దిరెడ్డి నాశనం చేశారు!
పుంగనూరు ఎమ్మెల్యే ఇక్కడి యువత భవిష్యత్తును నాశనం చేశారని, పెద్దిరెడ్డి మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచినా వైద్య సదుపాయాలు తీసుకురాలేకపోయాడని విమర్శించారు. "మేం అధికారంలోకి వస్తే చిత్తూరు జిల్లాకు మెడికల్ యూనివర్శిటీని తీసుకొస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తాం. రాజంపేట ఎంపీగా ఒక వ్యక్తిని మీరు రెండుసార్లు గెలిపించారు. ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా? పెద్దిరెడ్డిని ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిపించారు. మీకు ఉపయోగం లేదు. పాపాలు చేసే వారిని, మోసాలు చేసేవారిని గెలిపించి, ఉపయోగపడేవారిని పక్కనబెడితే మీకు పరిశ్రమలు, ఉద్యోగాలు ఎలా వస్తాయి?
ఈ పుంగనూరులో పెద్దిరెడ్డికి చెందిన శివశక్తి డెయిరీ తప్ప, మరేదైనా డెయిరీ ఇక్కడ ఉందా? పల్ప్ కంపెనీ పెద్దిరెడ్డి తమ్ముడి కొడుకు పెట్టి రైతులను దోచుకుంటున్నాడు. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే టీడీపీ ని గెలిపించండి. మీకు నిజమైన అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం. పెద్దిరెడ్డి కుటుంబం ఎమ్మెల్యే, ఎంపీ పదవుల్లో ఉన్నంతకాలం మీ పుంగనూరుకు ఏమీ రావు" అని స్పష్టం చేశారు.
వైసీపీ నేత వేధింపుల కారణంగానే మిస్బా ఆత్మహత్య
వైసీపీ నేత సునీల్ వేధింపుల కారణంగానే తమ కుమార్తె మిస్బా ఆత్మహత్య చేసుకుందని పీలేరులో ఆత్మహత్య చేసుకున్న మిస్బా తల్లిదండ్రులు లోకేశ్ ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. భోజన విరామ సమయంలో మిస్బా తల్లిదండ్రులు లోకేశ్ ను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మిస్బా బాగా చదువుకునేదని, క్లాస్ ఫస్ట్ వచ్చేదని తెలిపారు. వైసీపీ నాయకుడు సునీల్ కుమార్తెకి సెకెండ్ ర్యాంక్ వచ్చిందని ప్రిన్సిపల్ పై ఒత్తిడి చేసి తమ కుమార్తెకు టీసీ ఇచ్చి బయటకి పంపేశారని మిస్బా తల్లి నసీమా, తండ్రి వజీర్ అహ్మద్ ఆవేదన వెలిబుచ్చారు.. ఆ అవమానాన్ని భరించలేక తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. ఆ రోజు నుండి మేము న్యాయం కోసం పోరాడుతున్నాం.
వైసీపీ నాయకుడు సునీల్ ని అరెస్ట్ చెయ్యలేదని ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డి మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని. ఏడాది గడుస్తున్నా మాకు న్యాయం జరగలేదని వెల్లడించారు. మా కుమార్తె కు జరిగిన అన్యాయం మరే బిడ్డకు జరగకూడదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మిస్బాకు సంబంధించిన మార్కుల లిస్టులు, డ్రాయింగ్ పుస్తకాలు, వివిధ పోటీల్లో మిస్బా సాధించిన విజయాలకు సంబంధించిన సర్టిఫికెట్లు తెచ్చి లోకేశ్ కు చూపించారు. మైనారిటీ పిల్లలు బాగా చదవకూడదా? చదివితే వేధించి చంపేస్తారా? అంటూ తమ ఆవేదనను యువనేతకు చెప్పుకుని బాధపడ్డారు. "పైగా లోకేశ్ ను కలిస్తే చంపేస్తాం, ఊర్లో ఉండనివ్వం అంటూ బెదిరించారు. లోకేశ్ ని కలిస్తే ఇంట్లో సామాన్లు బయట పడేస్తాం, ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిందే అంటూ బెదిరించారు. మాకు పెద్ది రెడ్డి నుండి ప్రాణహాని ఉంది. మమ్మల్ని కాపాడండి" అంటూ లోకేష్ ను మిస్బా తల్లిదండ్రులు వేడుకున్నారు.
దీనిపై లోకేశ్ స్పందిస్తూ... మిస్బా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని, తన కూతురికి పోటీ వస్తోందనే కక్షతో మిస్బాకి చదువును దూరం చేయాలనే దురుద్దేశంతో వైసీపీ నాయకుడు సునీల్ బలవంతంగా టీసీ ఇప్పించారని ఆరోపించారు.
"మిస్బా తన డ్రాయింగ్ బుక్ లో నేను బాగా చదువుకోవాలి. డాక్టర్ కావాలని రాసుకుంది.(మిస్బా డ్రాయింగ్ బుక్ చూపిస్తూ). మిస్బా చేసిన తప్పేంటి? బాగా చదవడమే చేసిన తప్పా? వైసీపీ పాలనలో దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల వాళ్లు చదువుకోకూడదనే విధంగా పరిస్థితులు ఉన్నాయి. మిస్బా తల్లిదండ్రులను మేం ఓదారిస్తే దాన్ని రాజకీయం చేసి, వేధిస్తున్నారు. డాక్టర్ కావాలని కలలు కన్న మిస్బా ని వైసీపీ నేతలు అన్యాయంగా చంపేసారు. మీ కుటుంబానికి నేను అండగా ఉంటా. మీకు న్యాయం జరిగేలా నేను పోరాడతా. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిస్బా ఆత్మహత్యకు కారణం అయిన వారిని శిక్షిస్తాం" అని లోకేశ్ స్పష్టం చేశారు.
*యువగళం పాదయాత్ర వివరాలు:*
*ఇప్పటి వరకు నడిచిన దూరం కి.మీ. 448.1 కి.మీ.*
*ఈరోజు నడిచిన దూరం – 11.1 కి.మీ.*
*యువగళం పాదయాత్ర 35వ రోజు షెడ్యూల్(5-3-2023)*
*పీలేరు నియోజకవర్గం*
ఉదయం
8.00 – జ్యోతినగర్ (పులిచర్ల మండలం) విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – ఎంజెఆర్ కాలేజి అగ్రహారం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.
10.00 – పీలేరు భాస్కర్ ఐటిఐ కళాశాల వద్ద పీలేరు నియోజకవర్గంలో ప్రవేశం.
10.30 – పీలేరు భాస్కర ఐటిఐ సమీపంలో భోజన విరామం.
సాయంత్రం
3.50 - భాస్కర ఐటిఐ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.00 – పీలేరులో బహిరంగసభలో యువనేత ప్రసంగం.
5.30 – పీలేరు జంక్షన్ వద్ద స్థానికులతో మాటామంతీ.
6.05 – పీలేరు ఆర్టీసీ బస్టాండు వద్ద స్థానికులతో భేటీ.
6.25 – ప్రభుత్వాసుపత్రి అంబేద్కర్ విగ్రహవద్ద ముస్లింలతో మాటామంతీ.
6.50 – అజంతా టాకీస్ మిట్టపీలేరు వద్ద స్థానికులతో భేటీ.
8.00 – పీలేరు శివారు విడిది కేంద్రంలో బస.