Summer: అప్పుడే మండిపోతున్న ఎండలు.. గతేడాది కంటే ఎక్కువగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు
- తెలంగాణలోని చాలా జిల్లాలో రెండు డిగ్రీలకు పైగా పెరిగిన ఉష్ణోగ్రతలు
- భూపాలపల్లి జిల్లాలో నిన్న 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
- మున్ముందు మరింత పెరుగుతాయంటున్న నిపుణులు
ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఎండల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జనాన్ని అప్పుడే భయపెడుతున్నాయి. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గతేడాది ఇవే రోజులతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గతేడాది నాలుగో తేదీన 37.3 డిగ్రీలు నమోదు కాగా, నిన్న దాదాపు మూడు డిగ్రీలు అధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లాలోనూ నిన్న 40 డిగ్రీలు నమోదైంది. నిజామాబాద్, మహబూబ్‌నగర్, భద్రాచలం జిల్లాల్లో ఉష్ణోగ్రత 21 డిగ్రీలు దాటింది. వేసవిలోకి అడుగుపెట్టీ పెట్టగానే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం మున్ముందు ఎండలు ముదురుతాయని చెప్పడానికి సంకేతమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.