Sania Mirza: నేడు హైదరాబాద్ లో సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్.. ఎక్కడంటే
- ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడనున్న సానియా
- బోపన్న, ఇవాన్ డోడింగ్, కారా బ్లాక్, బెథానీతో కలిసి ఆట
- మధ్యాహ్నం 12 గంటల నుంచి మ్యాచ్ లు ప్రారంభం
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా రెండు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. దేశంలో టెన్నిస్‌కే వన్నె తెచ్చిన ఆమె గత నెలలో వీడ్కోలు పలికింది. అయితే తాను ఓనమాలు నేర్చుకున్న హైదరాబాద్ గడ్డపై చివరిసారి రాకెట్ పట్టి బరిలోకి దిగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 12 నుంచి ఎల్బీ స్టేడియం టెన్నిస్ కాంప్లెక్స్‌లో సానియా తన అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో పేర్ వెల్ మ్యాచ్ ఆడనుంది. డబుల్స్ సహచరులు బెతానీ మాటెక్ సాండ్స్, రోహన్ బోపన్న, ఇవాన్ డోడింగ్, కారా బ్లాక్, మరియోన్ బర్తోలితో విమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ లో ఎగ్జిబిషన్ మ్యాచ్ లు ఆడనుంది.
‘నా చివరి మ్యాచ్‌ను హైదరాబాద్‌లో సొంత అభిమానుల ప్రేక్షకుల ముందు ఆడి వారికి నా కృతజ్ఞత తెలపాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నా. నా కెరీర్ ప్రారంభమైన చోటుకే తిరిగి రావడం వ్యక్తిగతంగా నాకు గొప్పగా అనిపిస్తోంది. నా ఈ ప్రయాణం, అనుభవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను వారి కలలను నెరవేర్చుకోవడానికి, లక్ష్యాలను సాధించుకునేందుకు కష్టపడి పనిచేసేలా స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను’ అని సానియా చెప్పుకొచ్చింది.
ఆటలో తాను ఊహించిన దానికంటే ఎక్కువ సాధించానని సానియా తెలిపింది. ఒలింపిక్ మెడల్ నెగ్గకపోవడం ఒక్కటే కెరీర్ లో లోటు అని చెప్పింది. ఇకపై హైదరాబాద్ తో పాటు విదేశాల్లో ఉన్న తన అకాడమీల్లో క్రీడాకారులను తీర్చిదిద్దడంతో పాటు తన కొడుకు ఇజాన్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తానని చెప్పింది.