Banner: స్కూలు గేటు ముందు ‘ఐ లవ్ సిసోడియా’ బ్యానర్.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

Police Case Against Delhi School For I Love Manish Sisodia Banner Against Delhi School

  • ఆప్ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న స్థానికులు
  • లిక్కర్ కేసులో నిందితుడికి స్కూలు పిల్లలతో జేజేలు కొట్టించడంపై ఆగ్రహం
  • స్కూలు ఆవరణలోకి రాజకీయాలను తీసుకురావడమేంటని నిలదీత

ఢిల్లీలోని ఓ ప్రభుత్వ స్కూలు ముందు ‘ఐ లవ్ మనీశ్ సిసోడియా’ అంటూ ఓ బ్యానర్ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. శుక్రవారం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనికి స్కూలు మేనేజ్ మెంట్ కమిటీ కో ఆర్డినేటర్ గజాలా, స్కూలు ప్రిన్సిపాల్ మద్దతుగా నిలవడంపై స్థానికులు అభ్యంతరం తెలిపారు. అయినా వినకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని స్థానికులు చెబుతున్నారు. దీంతో పోలీసులు స్కూలు దగ్గరికి చేరుకుని బ్యానర్ ను తొలగించారు. బ్యానర్ కట్టిన వారిపై కేసు నమోదు చేశారు.

శుక్రవారం నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ఏరియాలో ఉన్న ప్రభుత్వ స్కూలు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు అభ్యంతరం చెప్పినా స్కూలు ప్రిన్సిపాల్ పట్టించుకోలేదు.. శనివారం వరకూ ఆ బ్యానర్ అలాగే ఉందని, బ్యానర్ ముందు పిల్లలను కూర్చోబెట్టి ఆప్ కార్యకర్తలు ఫొటోలు తీసుకున్నారని స్థానికులు చెప్పారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికుడు దివాకర్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయంతో సమానమైన స్కూలులోకి రాజకీయాలను తీసుకురావడం సరికాదని విమర్శించారు. పిల్లల మనసులను కలుషితం చేయడం తగదన్నారు. లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పిల్లలతో జేజేలు కొట్టించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కూలు ముందు ఇలా బ్యానర్ కట్టడమేంటని, అనుమతి ఎవరిచ్చారని అడగగా.. స్థానిక ఎమ్మెల్యే అబ్దుల్ రహమాన్ పర్మిషన్ ఇచ్చారని ఆప్ కార్యకర్తలు చెప్పారన్నారు. వెంటనే ఎమ్మెల్యేకు ఫోన్ చేయగా.. బ్యానర్ పెట్టేందుకు తానే పర్మిషన్ ఇచ్చినట్లు ఎమ్మెల్యే కూడా చెప్పారని దివాకర్ పాండే తెలిపారు. మిగతా వారితో కలిసి ఆందోళన వ్యక్తం చేయడంతో సదరు బ్యానర్ ను శనివారం తొలగించారని చెప్పారు. స్కూలు పిల్లలను బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని దివాకర్ పాండే డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News