Bank scam: బ్యాంకు నుంచి ఇలాంటి మెసేజ్ వచ్చిందంటే అనుమానించాల్సిందే!
- కొత్తరకం మోసానికి తెరతీసిన సైబర్ నేరస్థులు
- పాన్ కార్డుతో అనుసంధానం చేయలేదంటూ సందేశాలు
- మీ ఖాతా బ్లాక్ చేశామంటూ గందరగోళంలో పడేసే ప్రయత్నం
- మెసేజ్ లో సూచించిన లింక్ తెరిస్తే ఖాతాలో సొమ్ము మాయం
‘ప్రియమైన ఖాతాదారుడికి.. పాన్ కార్డుతో లింక్ చేయకపోవడంతో మా బ్యాంకులో ఉన్న మీ ఖాతాను తాత్కాలికంగా బ్లాక్ చేశాం. ఖాతాను పునరుద్దరించడానికి వెంటనే పాన్ కార్డును అప్ డేట్ చేయండి’ అంటూ బ్యాంకు నుంచి మీ మొబైల్ కు మెసేజ్ వచ్చిందా? అయితే తప్పకుండా సందేహించాల్సిందే! మీ బ్యాంకు ఖాతాలోని సొమ్మును కాజేసేందుకు సైబర్ నేరస్థులు పన్నిన కొత్త వల. పొరపాటున కూడా మెసేజ్ లో సూచించిన లింక్ ను తెరవొద్దు. తొందరపడి తెరిచారో.. మీ ఖాతాలో సొమ్ము మాయమైపోతుంది.
గడిచిన వారం రోజుల్లో ముంబైలోని ఓ ప్రైవేట్ బ్యాంకు కస్టమర్లు దాదాపు 40 మందికి ఇలాంటి సందేశాలే వచ్చాయని బ్యాంకింగ్ నిపుణులు చెప్పారు. కొంతమంది పాన్ కార్డును అప్ డేట్ చేయడానికి అందులో సూచించిన లింక్ ఓపెన్ చేయడంతో వారి ఖాతాలోని సొమ్మును సైబర్ నేరస్థులు కొట్టేశారని వివరించారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సైబర్ నేరస్థుల మోసం బయటపడిందని తెలిపారు.
డబ్బులు కొట్టేస్తున్నదిలా..
సైబర్ నేరస్థుల బారినపడి 57 వేలు పోగొట్టుకున్న ముంబై మహిళ శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. ముందుగా బ్యాంకు నుంచి పాన్ కార్డు అప్ డేట్ చేయాలని హెచ్చరిస్తూ సందేశం వస్తుంది. అందులోని లింక్ ఓపెన్ చేసి వెంటనే ఆ పని పూర్తిచేయాలనే సూచన ఉంటుంది. మెసేజ్ లోని లింక్ ను ఓపెన్ చేయగానే మీ అకౌంట్ నెంబర్, పాన్ కార్డు నెంబర్, నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్ వర్డ్ అడుగుతుంది. ఈ వివరాలు అప్ లోడ్ చేశాక బ్యాంకు నుంచి ఫోన్ వస్తుంది.
మీ బ్యాంకు ఆధీకృత టెలీకాలర్ ను మాట్లాడుతున్నానంటూ పరిచయం చేసుకుని, మీ మొబైల్ కు వచ్చిన రెండు ఓటీపీలను చెప్పాలని కోరతారు. అవి చెప్పగానే కాల్ కట్ అవుతుంది. అదేవిధంగా మీ ఖాతాలోని సొమ్ము మాయం అవుతుంది. తన విషయంలో ఇలాగే జరిగిందని, తన ఖాతాతో పాటు తన కొడుకు ఖాతాలోంచి మొత్తం 57,600 రూపాయలు సైబర్ నేరస్థులు కొట్టేశారని శ్వేత వాపోయారు. ఈ మోసంపై ముంబై సైబర్ సెల్ పోలీసులకు శ్వేత ఫిర్యాదు చేశారు.
ఇలాంటి మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వస్తే ఏంచేయాలి?
- బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్ లు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు ఖాతాకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు.. అంటే డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలు, సీవీవీ, పిన్ నెంబర్లు, ఓటీపీ వంటివి ఎవరికీ చెప్పకూడదు.
- అచ్చంగా బ్యాంకు నుంచి వచ్చిన లింక్ ల మాదిరిగానే ఉన్నప్పటికీ మోసపూరిత సందేశాలలో అక్షరదోషాలు ఉంటాయి. అక్షరాలు వెనకాముందు ఉండడమూ చూడొచ్చు. బహుశా అది స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుని ముందుకెళ్లడమంటే మోసగాళ్లకు సాయం చేయడమే.
- ఇలాంటి సందేశాలలో హెచ్చరికలు సాధారణం. వెంటనే చేయకపోతే మీ ఖాతా రద్దవుతుందనో, తర్వాత బ్యాంకు చుట్టూ తిరగాలనో, డాక్యుమెంటేషన్ కు చాలా రోజులు పడుతుందనో బెదిరించడం సహజం. ఇది మిమ్మల్ని గందరగోళంలోకి నెట్టి, మీరు ఆలోచించుకునేందుకు సమయం ఇవ్వకుండా నేరస్థులు వేసే ఎత్తుగడ.
- బ్యాంకు నుంచి వచ్చిన సందేశాలలో ఇలాంటి హెచ్చరికలు ఏవైనా ఉంటే కంగారుపడకుండా మీకు దగ్గర్లోని బ్రాంచికి నేరుగా వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవాలి. ఆ సందేశం నిజమే అయితే బ్యాంకులోనే నేరుగా అవసరమైన పేపర్లు అందజేసి, ఖాతాను అప్ డేట్ చేయించుకోవాలి.
- తెలిసో తెలియకో మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకుని మీ ఖాతా వివరాలను చెప్పేస్తే.. వెంటనే సదరు ఖాతా పాస్ వర్డ్ లు మార్చేయాలి.
- మీ ఖాతా ఉన్న బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయాలి.
- మీరు చేసే లావాదేవీలకు టు స్టెప్ వెరిఫికేషన్ పెట్టుకోవడం మంచిది.
- సైబర్ నేరస్థుల బారిన పడి డబ్బు కోల్పోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి.