Anand Mahindra: హైవే మధ్యలో టన్నెల్.. ఒకటి రెండు రోజుల్లోనే: ఆనంద్ మహీంద్రా వీడియో
- నెదర్లాండ్స్ లో టన్నెల్ నిర్మాణ వీడియోని షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- వేగంగా మౌలిక సదుపాయాల కల్పనతో అందరికీ ప్రయోజనాలన్న అభిప్రాయం
- మన దేశానికి ఇలాంటివి అవసరమన్న పారిశ్రామికవేత్త
రద్దీగా ఉండే జాతీయ రహదారి కింద నుంచి ఓ టన్నెల్ (సొరంగ మార్గం) ను అతి తక్కువ సమయంలో (48 గంటల్లో/వారాంతాన) నిర్మించడం అంత ఆషామాషీ విషయం కాదు. దీన్ని పాశ్చాత్య దేశాలు ఆచరణలో చేసి చూపిస్తున్నాయి. అలాంటి ఒక వీడియోని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ హ్యాండిల్ పై పోస్ట్ చేశారు.
‘‘ఒక వారాంతంలో హైవే కింద టన్నెల్ ను డచ్ (నెదర్లాండ్స్) నిర్మించింది. ఈ నైపుణ్యాలను మనం కూడా తప్పకుండా సంపాదించాలి. ఇది కేవలం మానవ వనరులను ఆదా చేయడమే కాదు, విలువైన సమయాన్ని ఆదా చేస్తుంది. అభివృద్ధి దశలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇది కూడా కీలకమే. వేగంగా మౌలిక సదుపాయాల కల్పన అంటే వేగవంతమైన అభివృద్ధి, ప్రయోజనాలు అందరికీ అందించడం’’అని ఆనంద్ మహీంద్రా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ వీడియోని ఇప్పటికే 19 లక్షల మంది చూశారు. పలువురు ఫాలోవర్లు తమ అభిప్రాయాలను సైతం కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. మనం సైతం ఇలాంటి టెక్నాలజీలను అమల్లోకి తీసుకురావాలని, మన దగ్గర ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని, వేగం, సమయం అన్నవి ఎంతో విలువైన వనరులని పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు.