Gautam Adani: అదానీ స్టాక్స్ కొన్న ఎన్ఆర్ఐకి రెండు రోజుల్లోనే 3 వేల కోట్ల లాభం
- నాలుగు అదానీ కంపెనీలలో రూ.15,446 కోట్ల విలువైన వాటా కొన్న రాజీవ్ జైన్
- రెండు రోజుల్లోనే స్టాక్స్ విలువ రూ.18,548 కోట్లు పెరిగిన వైనం
- హిండెన్ బర్గ్ రిపోర్టుతో అదానీ కంపెనీలకు భారీ నష్టాలు
హిండెన్ బర్గ్ రిపోర్ట్ దెబ్బకు గౌతమ్ అదానీ గ్రూపునకు చాలా నష్టం వచ్చింది. అదానీ సంస్థల షేర్లన్నీ పతనం అయ్యాయి. కొన్ని రోజుల పాటు భారత స్టాక్ మార్కెట్ మొత్తం కుదేలైంది. అదానీ షేర్లు కొన్న వారికి భారీగా నష్టం వాటిల్లింది. కానీ, ఓ ఎన్ఆర్ఐ మాత్రం అదానీ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టి రెండు రోజుల్లోనే మూడు వేల కోట్లు లాభాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఆయన పేరు రాజీవ్ జైన్. ఆయన ఆధ్వర్యంలోని జీక్యూజీ పార్ట్ నర్స్ అనే సంస్థ అదానీ స్టాక్స్ నెల రోజుల పాటు పతనమైన తర్వాత నాలుగు అదానీ కంపెనీలలో రూ.15,446 కోట్ల విలువైన వాటాలను కొన్నారు.
స్టాక్ మార్కెట్ లో అదానీ షేరు విలువ పెరగడంతో రెండు రోజుల్లోనే రాజీవ్ జైన్ కొన్న స్టాక్స్ విలువ రూ.18,548 కోట్లు అయింది. దాంతో, ఆయనకు రూ.3,102 కోట్ల లాభం వచ్చింది. చౌకగా లభించిన షేర్లు దీర్ఘకాలంలో విపరీతంగా బాగా పెరుగుతాయన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు జైన్ తెలిపారు. జైన్ గురువారం రూ.1,410.86 ధర దగ్గర అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లను కొన్నారు. అప్పటి నుండి స్టాక్ ధర 33శాతం మేర పెరగడంతో ఆయన పంట పండింది.