pithani satyanarayana: నాలుగేళ్లు సీఎం జగన్ నిద్రపోయారా?: పితాని సత్యనారాయణ
- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో వచ్చాయంటున్న పెట్టుబడులన్నీ అంకెల గారడీలేనని పితాని విమర్శ
- యువతను ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపణ
- ఏయే పరిశ్రమలు వచ్చాయి? ఎవరెవరు, ఏయే ఒప్పందాలు చేసుకున్నారో చెప్పాలని డిమాండ్
విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ విమర్శలు చేశారు. రాష్ట్రానికి వచ్చాయని చెబుతున్న పెట్టుబడులన్నీ అంకెల గారడీలేనని, అవాస్తవాలేనని ఆరోపించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటూ యువతను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు.
పెట్టుబడుల విషయంలో నాలుగేళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డి నిద్రపోయారా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘నాలుగేళ్లు నిద్రపోయారు.. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చేసింది. ఉత్తరాంధ్రలో ఎన్నిక జరుగుతోంది. ఇది వచ్చే ఎన్నికల కోసం చేసిన స్టంట్’’ అని ఆరోపించారు.
రాష్ట్రానికి పరిశ్రమలు రావాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలని తాము కోరుకుంటున్నామని పితాని సత్యనారాయణ అన్నారు. ‘‘ఎన్ని లక్షల కోట్లు వచ్చాయి? ఏయే పరిశ్రమలు వచ్చాయి? ఎవరెవరు ఏయే ఒప్పందాలు చేసుకున్నారు? వాటి కాల పరిమితి ఎంత?’’అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేయాలనుకుంటే, నిజం చెప్పాలనుకుంటే.. మొత్తం ఒప్పందాల జాబితాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
ఇది రాష్ట్ర అభివృద్ధి కోరుకున్న ప్రభుత్వమని తాము భావించడంలేదని పితాని విమర్శించారు. ఉద్యమం ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ తరలిపోతున్నా నిర్లిప్తత ప్రదర్శిస్తున్నారని, కానీ ఇప్పుడేమో విశాఖ రాజధాని అంటున్నారని మండిపడ్డారు.