Suryanarayana: మేం చేసింది విజ్ఞప్తి... ప్రభుత్వం దాన్ని ఫిర్యాదుగా భావించింది: ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ
- ఇటీవల గవర్నర్ ను కలిసిన ఉద్యోగుల సంఘం
- సంఘం గుర్తింపు రద్దుకు నోటీసులు పంపారన్న సూర్యనారాయణ
- కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేశారని ఆవేదన
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. జీతాల చెల్లింపులో చట్టబద్ధత కల్పించాలని ఇటీవల గవర్నర్ ను కలిసి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. తాము చేసింది విజ్ఞప్తి మాత్రమేనని, కానీ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఫిర్యాదుగా భావించిందని విచారం వ్యక్తం చేశారు.
గవర్నర్ ను కలిసిన నేపథ్యంలో, తమ సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదని నోటీసులు జారీ చేశారని సూర్యనారాయణ వెల్లడించారు. ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న వారిని విచారణ అధికారిగా పేర్కొన్నారని విమర్శించారు. కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అటు, ఇవాళ విశాఖలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సమావేశం జరిగింది. సమాఖ్య చైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ, ఒకట్రెండు ఇబ్బందులకే కొందరు నిరసన బాటపడుతున్నారని విమర్శించారు. ఉద్యోగుల విషయంలో సీఎం అన్యాయం చేయరని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఉండొచ్చని వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు.