Tara Norris: 5 వికెట్లతో మెరిసిన అమెరికా'తార'... మురిసిన ఢిల్లీ క్యాపిటల్స్
- రాయల్ చాలెంజర్ బెంగళూరును ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్
- తొలుత 223 పరుగులు చేసిన ఢిల్లీ
- 163 పరుగులే చేసి ఓటమిపాలైన బెంగళూరు
డబ్ల్యూపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో తన ప్రస్థానం ఆరంభించింది. ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ముంబయిలో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించిన ఢిల్లీ... ఆ తర్వాత బౌలింగ్ లోనూ రాణించింది. 224 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేసి ఓటమి పాలయ్యారు.
ఢిల్లీ బౌలర్లలో లెఫ్టార్మ్ మీడియం పేస్ బౌలర్ తారా నోరిస్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. తారా నోరిస్ అమెరికాకు చెందిన క్రికెటర్.
ఇక, అలిస్ కాప్సే 2, శిఖా పాండే 1 వికెట్ తీశారు. బెంగళూరు బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధన 35, హీదర్ నైట్ 34, ఎలిస్ పెర్రీ 31, మేగాన్ షట్ 30 (నాటౌట్) పరుగులు చేశారు.
కాగా... నేటి రెండో మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక. టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ ఎంచుకుంది.
నిన్న జరిగిన డబ్ల్యూపీఎల్ ప్రారంభ మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ 143 పరుగుల తేడాతో ముంబయి ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ లో గెలిచితీరాలన్న కృతనిశ్చయంతో గుజరాత్ జట్టు బరిలో దిగుతోంది.