Toll Fee: ఏప్రిల్ ఒకటి నుంచి పెరగనున్న ‘టోల్’ చార్జీలు.. పాస్‌ల ధరలూ పెంపు!
- 5 నుంచి 10 శాతం పెంచే యోచన
- ఇటీవల ప్రారంభమైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే మార్గంలోనూ పెంపు!
- ఈ నెలాఖరు నాటికి రాష్ట్రాలకు ఆదేశాలు!
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి టోల్ చార్జీలను 5 నుంచి 10 శాతం మేర పెంచాలని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఫలితంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ హైవేలపై ప్రయాణించే వారిపై మరింత భారం పడనుంది. ఇటీవలే దౌసా వరకు ప్రారంభమైన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్ హైవే మార్గంలోనూ టోల్ రేట్లు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మార్గంలో ప్రస్తుతం కిలోమీటరుకు రూ. 2.19 వసూలు చేస్తుండగా దీనిపై కనీసం 10 శాతం పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ రహదారిపై రోజుకు 20 వేల వాహనాలు ప్రయాణిస్తుండగా వచ్చే ఆరు నెలల్లో ఈ సంఖ్య 60 వేలకు పెరిగే అవకాశం ఉందని అంచనా. అలాగే, ప్రస్తుతం టోల్‌గేట్‌కు 20 కిలోమీటర్ల పరిధిలో ఉండే వాణిజ్యేతర వాహనదారులు నెలకు రూ. 315 పాసు చెల్లించి ఎన్నిసార్లు అయినా ప్రయాణించే వీలుంది. ఇప్పుడీ పాసుల ధరలను కూడా 10 శాతం పెంచే అవకాశం ఉంది.
ఏడాదికోసారి సవరణ
సాధారణంగా టోల్ చార్జీలను ఏడాదికోసారి సవరిస్తూ ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు, ఆయా రహదారిపై ప్రయాణించే వాహనాల సంఖ్య, గతంలో వసూలైన రుసుముల ఆధారంగా ధరలను సవరిస్తారు. ఈ ప్రతిపాదనను కేంద్ర రోడ్డు, రవాణాశాఖకు ఎన్‌హెచ్ఏఐ పంపుతుంది. దీనిపై ప్రభుత్వం నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఈ నెలాఖరు నాటికి నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.