Vivek Ramaswamy: నేను కనుక అధ్యక్షుడినైతే.. అమెరికాలో విద్యాశాఖను, ఎఫ్‌బీఐని రద్దు చేస్తా: ఇండో-అమెరికన్ రామస్వామి సంచలన వ్యాఖ్యలు
- అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీపడుతున్న వివేక్ రామస్వామి
- విద్యాశాఖ ఎందుకుందో కూడా అర్థం కావడం లేదని ఆవేదన
- విద్యాశాఖను, ఎఫ్‌బీఐని రద్దు చేసి వేరే సంస్థలు ఏర్పాటు చేస్తానని స్పష్టీకరణ
- ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’ నినాదం స్ఫూర్తినిచ్చిందన్న రామస్వామి
అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీపడుతున్న ఇండో-అమెరికన్ వివేక్ రామస్వామి(37) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కనుక అధ్యక్షుడిగా ఎన్నికైతే వెంటనే విద్యాశాఖను, ఎఫ్‌బీఐని రద్దు చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు విద్యాశాఖ ఎందుకు ఉందో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. ఈ రెండింటి స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే, చైనాతో అమెరికా కంపెనీలు వ్యాపారం చేయకుండా నిషేధిస్తానన్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్న ఆయన శనివారం జరిగిన కన్జర్వేటివ్ రాజకీయ కార్యాచరణ సదస్సు (సీపీఏటీ)లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వివేక్ ప్రశంసలు కురిపించారు. ‘అమెరికా ఫస్ట్’ అనే ట్రంప్ నినాదం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. జాతి, లింగం, పర్యావరణం అనేవి లౌకిక మతాలుగా మారి దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని రామస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క, తాను వరుసగా మూడోసారి కూడా అధ్యక్ష రేసులో నిలుస్తున్నట్టు ట్రంప్ స్పష్టం చేశారు. తనపై ఎన్ని నేరాభియోగాలు మోపినా పోటీ నుంచి వెనక్కి తగ్గబోనని తేల్చి చెప్పారు.