Britain: బ్రిటన్ రాజు ఆహ్వానాన్ని యువరాజు హ్యారీ అంగీకరిస్తాడా?
- రాజు పట్టాభిషేకానికి రావాలంటూ ఆహ్వానం
- ధ్రువీకరించిన హ్యారీ అధికార ప్రతినిధి
- వెళ్లే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రకటన
- మే 6న జరగనున్న పట్టాభిషేకం
బ్రిటన్ రాజుగా చార్లెస్ పట్టాభిషేకానికి ఆయన చిన్న కుమారుడు, యువరాజు హ్యారీ, కోడలు మెఘాన్ హాజరవుతారా? ఇప్పుడు ఇదే ఆసక్తికరంగా మారింది. పట్టాభిషేకానికి రావాలంటూ హ్యారీ, మెఘాన్ కు ఆహ్వానం వెళ్లింది. ఈ విషయాన్ని హ్యారీ ప్రతినిధి ధ్రువీకరించారు. అయితే పట్టాభిషేకానికి హాజరయ్యేదీ, లేనిదీ ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది మే 6న పట్టాభిషేక కార్యక్రమానికి సన్నాహాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
హ్యారీ ఇటీవల తన రాజ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేయడం గమనార్హం. 2000లో రాజ కుటుంబం నుంచి అతడు పూర్తిగా విడివడడం తెలిసిందే. దీంతో రాజుగా చార్లెస్ పట్టాభిషేకానికి హ్యారీని ఆహ్వానిస్తారా, లేదా?.. ఒకవేళ పిలిచినా అతడు వస్తాడా? రాడా? అన్న సందేహాలు బ్రిటన్ వాసుల్లో పెద్ద ఎత్తున ఉన్నాయి. ‘‘పట్టాభిషేక కార్యక్రమానికి సంబంధించి ఇటీవలే మెజెస్టీ ఆఫీస్ నుంచి ఈ మెయిల్ ఆహ్వానం అందింది. అయితే, యువరాజు, ఆయన భార్య హాజరవుతారా? అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’’ అని హ్యారీ ప్రతినిధి ప్రకటించారు. తన ప్రేయసి మెఘాన్ విషయంలో హ్యారీ రాజ కుటుంబంతో వేరు పడడం తెలిసిందే.