stray dogs: వీధి కుక్కల సంతతి తగ్గాలంటే అసోం పంపించాల్సిందే: మహారాష్ట్ర ఎమ్మెల్యే వ్యాఖ్యలు
- అసోం వాసులు కుక్కలను ఆహారంగా తీసుకుంటారన్న ఎమ్మెల్యే బాబూరావు
- దాంతో అధిక కుక్కల సంతతికి పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్య
- ఒక్కో వీధి శునకం రేటు రూ.8,000-9,000
మహారాష్ట్రలో ఓ స్వతంత్ర ఎమ్మెల్యే అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జంతు ప్రేమికులు ఆయన్ను తిట్టిపోస్తున్నారు. అచల్ పూర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే ఓంప్రకాష్ బాబూరావు (బచ్చు కడు) పెరిగిపోయిన వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు ఓ సూచన చేశారు. మహారాష్ట్రలో ఉన్న అన్ని వీధి కుక్కలను అసోం రాష్ట్రానికి పంపించాలని, అక్కడి వారు ఈ కుక్కలను ఆహారంగా తింటారని సలహా ఇచ్చారు. మహారాష్ట్రలో పెరిగిపోయిన వీధి కుక్కల సంతతికి ఇదే పరిష్కారమని బాబూరావు పేర్కొన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో వీధి కుక్కల అంశంపై చర్చ జరిగింది. దీన్ని ఎమ్మెల్యేలు ప్రతాప్ సర్నాయక్, అతుల్ భట్కాల్కర్ లేవనెత్తారు. ఇదే చర్చలో భాగంగా ఎమ్మెల్యే ఓంప్రకాష్ బాబూరావు మాట్లాడారు. అసోంలో తాను ఇటీవలే పర్యటించినట్టు చెప్పారు. అక్కడ ఒక్కో శునకాన్ని రూ.8,000-9,000కు విక్రయిస్తున్నట్టు తెలిపారు. కనుక అసోం వర్తకులను పిలిచి వీధి కుక్కలను అప్పగించాలని సూచించారు.
ఎమ్మెల్యే బాబూరావు ప్రకటనను వరల్డ్ ఫర్ యానిమల్స్ ఎన్జీవో వ్యవస్థాపకుడు తరోనిష్ బల్సారా తప్పుబట్టారు. జంతువుల విషయంలో మహారాష్ట్ర సర్కారు చేసిన మంచి పనులకు ఎమ్మెల్యే ప్రకటన వ్యతిరేకమైనదిగా చెప్పారు. జంతు చట్టాల గురించి అవగాహన లేకుండా పోతోందన్నారు. పెరిగిపోతున్న వీధి శునకాలకు స్టెరిలైజేషన్ పరిష్కారమన్నారు. అసోంలో చట్టాల గురించి తనకు తెలియదని, మహారాష్ట్రలో మాత్రం శునకాల తరలింపు చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.