USA: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం!
- జార్జియా రాష్ట్రంలో వెలుగు చూసి కాల్పుల ఘటన
- టీనేజర్ల పార్టీలో తలెత్తిన తగవే కాల్పులకు దారి తీసిందని పోలీసుల అనుమానం
- కాల్పుల్లో ఇద్దరి మృతి, ఆరుగురికి గాయాలు
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. జార్జియా రాష్ట్రంలో ఓ ఇంట్లో టీనేజర్లు జరుపుకున్న పార్టీలో కాల్పులు జరగడంతో ఇద్దరు మృతి చెందారు. డగ్లస్‌విల్ కౌంటీలో శనివారం రాత్రి సుమారు 10.30 గంటలకు ఈ దారుణం జరిగింది. టీనేజర్ల మధ్య రేగిన తగవు చివరకు కాల్పులకు దారి తీసినట్టు స్థానిక పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. దీనికి బాధ్యులు ఎవరో తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షులను ఒక్కొక్కరిగా విచారిస్తున్నారు.
కాల్పులు జరిగిన సమయంలో ఇంట్లో 100 మందికి పైగా టీనేజర్లు ఉన్నట్టు సమాచారం. ఆ సమయంలో ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉన్నారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. ఈ ఘటనలో ఆరుగురు గాయాలపాలైనట్టు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిపింది ఒకరా? లేక ఎక్కువ మందా? అనేది తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.