Revanth Reddy: తండ్రి, కొడుకు, కూతురు కలిసి దేవుళ్లనూ మోసం చేశారు: కేసీఆర్ ఫ్యామిలీపై రేవంత్ విమర్శలు
- భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారన్న రేవంత్
- అబద్ధాల వాగ్దానాలతో మోసం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఆరోపణ
- కొండగట్టుకు రూ.500 కోట్లు విడుదల చేయాలని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. కల్వకుంట్ల ఫ్యామిలీ దేవుళ్లను కూడా మోసం చేసిందని మండిపడ్డారు. భక్తి ముసుగులో ఒకరు, అభివృద్ధి ముసుగులో మరొకరు దోచుకుంటున్నారని ఆరోపించారు. సోమవారం చొప్పదండిలో పాదయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. తర్వాత మీడియాతో మాట్లాడారు.
కొండగట్టుకు తక్షణం రూ.500 కోట్లు విడుదల చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. పూజారులు, భక్తులను, కొండగట్టు అంజన్నను అబద్ధాల వాగ్దానాలతో మోసం చేసిన ఘనత కేసీఆర్ దేనని ఆరోపించారు. కవిత హనుమాన్ చాలీసా పారాయణ చేసి.. 125 అడుగుల విగ్రహం కట్టిస్తానని మోసం చేశారని విమర్శించారు. తండ్రి, కొడుకు, కూతురు దేవుళ్లను కూడా మోసం చేశారని ఆరోపించారు.
600 ఏళ్ల చరిత్ర కలిగిన ఆలయాన్ని భక్తులకు ఇబ్బంది కలగకుండా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 800 ఎకరాల అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి కాపాడాలని కోరారు. కొండగట్టును కేసీఆర్ అభివృద్ధి చేస్తారనే నమ్మకం తమకు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
కొండగట్టు బస్సు బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని రేవంత్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. తూతూ మంత్రంగా ఆర్థిక సాయం చేశారని, ప్రమాదం జరిగిన చోట ఒక గోడ మాత్రం కట్టి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు.