Uttar Pradesh: నిర్లక్ష్యం చేసిన సంతానం.. ఓ పెద్దాయన సంచలన నిర్ణయం!
- తన పేరిట ఉన్న రూ.1.5 కోట్ల ఆస్తులు ప్రభుత్వానికి దానం
- వైద్య పరిశోధనల కోసం మృతదేహం దానమిస్తున్నట్టు విల్లు
- ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ కు చెందిన వృద్ధుడి నిర్ణయాలు
జన్మనిచ్చిన తల్లిదండ్రులు సాక్షాత్తూ దైవ స్వరూపులు అని పెద్దలు చెబుతుంటారు. పిల్లల సంతోషమే తమ సంతోషంగా, పిల్లలే తమ లోకంగా ప్రేమ, త్యాగాలతో పెంచి పెద్ద చేసిన తర్వాత.. వారిని వృద్ధాప్యంలో పట్టించుకోకుండా పోయేవారు ఎందరో ఉన్నారు. అలాంటి మనసులేని సంతానానికి ఓ పెద్దాయన కనువిప్పు కలిగించే నిర్ణయాలు తీసుకున్నాడు. ఆయనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు చెందిన 85 ఏళ్ల నాదూ సింగ్.
పిల్లలు తనని చూడకుండా వదిలేసి వెళ్లిపోవడంతో నాదూ సింగ్.. తన పేరిట ఉన్న రూ.1.5 కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చాడు. అంతేకాదు మరణానంతరం తన శరీరాన్ని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. తన అంతిమ క్రియలకు తన నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడిని అనుమతించొద్దంటూ షరతు పెట్టాడు.
నాదూసింగ్ కుమారుడు స్కూల్ టీచర్ గా సహరాన్ పూర్ లో పనిచేస్తున్నాడు. పిల్లలు అందరికీ వివాహాలు అయ్యాయి. భార్య మరణించడంతో నాదూసింగ్ ఒంటరి వాడయ్యాడు. పిల్లలు తండ్రిని పట్టించుకోకుండా గ్రామంలో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో ఆయన వృద్ధాశ్రమానికి చేరుకున్నాడు. ఎవరూ తనను పట్టించుకోకపోవడంతో తన పేరిట ఉన్న ఇల్లు, భూమి (రూ.1.5 కోట్లు విలువ చేసే) ప్రభుత్వానికి దానం చేస్తూ, తన మరణం తర్వాత అందులో ఆసుపత్రి లేదా స్కూల్ కట్టాలని కోరాడు. ఈ మేరకు విల్లు రాశాడు. తన మృతదేహాన్ని పరిశోధనల కోసం తీసుకునేందుకు అంగీకారం తెలిపాడు. నాదూసింగ్ మరణం తర్వాత ఆయన రాసిచ్చిన అఫడవిట్ అమల్లోకి వస్తుందని సబ్ రిజిస్ట్రార్ తెలిపారు.