Facebook: ఫేస్బుుక్లో మళ్లీ లేఆఫ్స్! ఈసారీ వేలల్లో ఉద్యోగుల తొలగింపు
- మరోమారు ఉద్యోగుల తొలగింపునకు మెటా సిద్ధమైందంటూ వార్తలు
- ఉద్యోగుల్లో తారస్థాయికి చేరుకున్న టెన్షన్
- ఉద్యోగుల తొలగింపుపై ఈ వారం చివరికల్లా స్పష్టత వచ్చే ఛాన్స్
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ వారం చివరికల్లా వేల మందిని తొలగించేందుకు రెడీ అవుతోందన్న వార్త ప్రస్తుతం టెక్ రంగంలో సంచలనంగా మారింది. దీంతో మెటా ఉద్యోగుల్లో టెన్షన్ తారస్థాయికి చేరుకుంది. మెటా ఇప్పటివరకూ 13 శాతం మంది సిబ్బందిని విధుల్లోంచి తీసేసింది. సంస్థ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఇటీవల ఏకంగా 11 వేల మందిని తొలగించింది. కేవలం కింది స్థాయి ఉద్యోగులనే కాకుండా.. మధ్య, ఉన్నత స్థానాల్లోని మేనేజర్లను తీసేసింది. సంస్థ నిర్వహణ సామర్థ్యం పెంపులో భాగంగా తొలగింపులకు దిగినట్టు మెటా అప్పట్లో పేర్కొంది.
అయితే.. ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగానే తాజాగా తొలగింపులు ఉండబోతున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవలి కాలంలో మెటాకు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుతూ వస్తోంది. దీంతో సంస్థ తన దృష్టినంతా మెటావర్స్ అనే వర్చువల్ రియాల్టీ వేదికపై కేంద్రీకరించింది. ఈ క్రమంలో అదనపు సిబ్బంది ఎవరున్నారో గుర్తించి తొలగించాలంటూ వివిధ విభాగాల డైరెక్టర్లు, ఉపాధ్యక్షులకు ఆదేశాలు జారీ చేసింది. ఈసారి ఎందరు ఉద్యోగం కోల్పోనున్నారో ఈ వారాంతానికల్లా తెలిసిపోతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మెటా ఉద్యోగి తెలిపారు. గతేడాది నవంబర్లో చేపట్టిన తొలగింపులు.. సంస్థ ఉద్యోగులకు షాకిచ్చినా మరోసారి లేఆఫ్స్ తప్పదని ఉద్యోగులు తొలి నుంచి అనుమానిస్తున్నారట. కాగా.. ఈ వార్తపై వ్యాఖ్యానించేందుకు మెటా ప్రతినిధి నిరాకరించారు.