USA: భారతీయ విద్యార్థులకు అమెరికా బంపర్ ఆఫర్
- ఓపీటీ దరఖాస్తుల పరిశీలనకు ప్రీమియం ప్రాసెసింగ్
- ఎఫ్-1 విద్యార్థులకు ఉపయుక్తం
- ఇకపై స్టూడెంట్స్‌కు త్వరగా ఉద్యోగానుమతులు
భారతీయ విద్యార్థులకు అమెరికా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగానుమతి కోసం విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించేందుకు ప్రీమియం ప్రాసెసింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది ఓపీటీ కోసం దరఖాస్తు చేసుకునే సైన్స్, మేథ్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ రంగాల విద్యార్థులకు లాభించనుంది.
కొన్ని కేటగిరీల విద్యార్థులకు మార్చి 6 నుంచే ఈ సౌలభ్యం అందుబాటులోకి వచ్చింది. ఇతర విద్యార్థులను ఏప్రిల్ 3 నుంచి ప్రీమియం ప్రాసెసింగ్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిస్తారు. ఈ మేరకు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్‌సీఐఎస్) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రీమియం ప్రాసెసింగ్ విధానం అంతర్జాతీయ విద్యార్థులకు ఎంతో ఉపయుక్తమని యూఎస్‌సీఐఎస్ డైరెక్టర్ ఎమ్. జాడో పేర్కొన్నారు.
ఈ విధానం భారతీయులకూ ఎంతో మేలు చేకూరుస్తుందని అక్కడి ఎన్నారైలు చెబుతున్నారు. ‘‘ఓపీటీ అనుమతి కోసం సుదీర్ఘ కాలం వేచిచూడాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్న అంతర్జాతీయ విద్యార్థులకు ఇది నిజంగా ఓ గుడ్ న్యూస్. ఎఫ్-1 వీసా ఉన్న విద్యార్థులకు ఇది ఎంతో లాభిస్తుంది’’ అని ఓ ఎన్నారై వ్యాఖ్యానించారు.